
చిన్నారిని కాపాడిన గీత
చెన్నై : పాలు అమ్మే వ్యక్తి పిలుపుకు బయటకు వచ్చిన గీతకు చిన్న మూలుగు శబ్దం వినిపించింది. పాపం ఏదో పిల్లి పిల్ల డ్రైనేజీ గుంత దగ్గర చిక్కుపడిందేమో అనుకున్న గీతకు అక్కడ కనపడిన దృశ్యం చూడగానే ఒక్కసారి ఒళ్లు జలదరించింది. కారణం ఆ అరుపులు పిల్లివి కాదు.. ఇంకా పూర్తిగా కళ్లు తెరవని ఓ పసిగుడ్డువి. అంతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పసివాణ్ణి బయటకు తీసింది గీత. ఆ చిన్నారికి దెబ్బలు ఏమైనా తగిలాయేమో పరిశీలించింది. అనంతరం ఆ పసివాణ్ణి శుభ్రం చేసి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. చెన్నైలోని వలసరవక్కంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
‘నీ మంచి మససుకు సలాం’ అంటూ నెటిజన్లు గీతను తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పసివాడు క్షేమంగానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. ఈ విషయం గురించి గీతా ‘పాలు అమ్మే వ్యక్తి చెప్పడం వల్ల నేను శబ్దం వస్తోన్న వైపుగా వెళ్లాను. అదృష్టం కొద్ది పసివాడు ఉన్న చోట నీరు లేదు కాబట్టి క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారుల సంక్షేమ గృహానికి చేరుస్తాం అని అధికారులు తెలిపారన్నారు గీత. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ బాలునికి ‘సుతంథిరమ్’(తమిళ పదం. దానికి అర్ధం స్వేచ్ఛ) అనే పేరు పెట్టినట్లు తెలిపారు గీత.
Comments
Please login to add a commentAdd a comment