
దేశంలో నాలుగు కోట్ల బూతు సైట్లు!!
భారతదేశంలో బూతు వెబ్ సైట్లను నియంత్రించడం తమవల్ల కావట్లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు మొరపెట్టుకుంది. దాదాపు నాలుగు కోట్ల బూతు వెబ్ సైట్లు ఉన్నాయని, ఒకదాన్ని బ్లాక్ చేస్తుంటో అలాంటివి మరికొన్ని వస్తున్నాయని తెలిపింది. చైల్డ్ పోర్నోగ్రఫీ మీద నిషేధం విధించాలని, అలాగే ఎడల్ట్ పోర్న్ వెబ్సైట్లను బ్లాక్ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఈ విషయం తెలిపింది.
బూతు వెబ్సైట్లకు ఉపయోగిస్తున్న సెర్వర్లన్నీ దేశం వెలుపల ఉన్నాయని, అందువల్ల వాటిపై నియంత్రణ కష్టం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి ఓ కమిటీని నియమించామంది. వచ్చే విచారణ నాటికి ఈ కమిటీ ఏం చేసిందో తమకు తెలియజేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీని అరికట్టేందుకు చట్టం, సాంకేతిక పరిజ్ఞానం, పాలన అన్నీ కలగలిసి పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి కేంద్రానికి తెలిపారు.