వయనాడ్‌లో నలుగురు గాంధీలు | Four Gandhis In The Fray | Sakshi
Sakshi News home page

వయనాడ్‌లో నలుగురు గాంధీలు

Published Wed, Apr 24 2019 5:56 PM | Last Updated on Wed, Apr 24 2019 6:05 PM

Four Gandhis In The Fray - Sakshi

రాహుల్‌ గాంధీ(ఎడమ)..రఘుల్‌ గాంధీ(కుడి)

సాక్షి, న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుత అధ్యక్షుడే కాకుండా భారత ప్రధాన మంత్రులకు కుమారుడు, మనవడు, మునిమనవడు. కనుక ఆయనకు గాంధీ ఇమేజ్‌ ఎక్కువగానే ఉంటుంది. దాంతో ప్రజలందరికి సులువుగానే తెలిసిపోతారు. అంత వరకు దాని వల్ల ఉపయోగమే. కానీ వారసత్వ రాజకీయాలను ద్వేషించే వారి విషయంలో అది ప్రతికూల అంశమే అవుతుంది. గాంధీకున్న పేరును దెబ్బతీయాలనో, వాడుకోవాలే అనో, తద్వారా అంతోఇంతో పేరు పొందాలనే ఉద్దేశంతోనో కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్‌ గాంధీపై ముగ్గురు గాంధీలు పోటీకి దిగారు. 

ఒకప్పుడు ఓటర్లను గందరగోళానికి గురి చేయడానికి ఒకే పేరుగల వ్యక్తులను పోటీలోకి దింపేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పేర్ల పక్కన గుర్తులతోపాటు ఫొటోలు కూడా వచ్చాయి. పేరు కోసమే కావచ్చు. రాహుల్‌ గాంధీపైన రాహుల్‌ గాంధీ కేఈ, రఘుల్‌ గాంధీ, కేఎం శివప్రసాద్‌ గాంధీలు పోటీకి దిగారు. వీరిలో రాహుల్‌ గాంధీది హస్తం గుర్తుకాగా, రఘుల్‌ గాంధీది బకెట్, రాహుల్‌ గాంధీ కేఈది ఇసుక గడియారం, శివప్రసాద్‌ గాంధీది ఏర్‌ కండీషనర్‌ గుర్తులు. వీరిలో కాస్త పేరున్న వ్యక్తి రఘుల్‌ గాంధీ. ఆయన హిందుస్థాన్‌ జనతా పార్టీ మద్దతుతో ‘అఖిల ఇండియా మక్కన్‌ కళగం’ పార్టీ తరఫున బరిలోకి దిగారు.

రాహుల్‌ గాంధీ కేఈ  కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. స్వతంత్య్ర సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. శివప్రసాద్‌ గాంధీ కేరళ త్రిసూర్‌ జిల్లాకు చెందిన స్కాలర్‌. ఆయన గాంధీయన్‌ పార్టీలో పనిచేస్తున్నారు. ఆయన ఆ పార్టీలో చేరాకే తన పేరు చివరన గాంధీ అనే ట్యాగ్‌ను తగిలించుకున్నారు. ఇద్దరు గాంధీలు, రాహుల్‌ గాంధీకన్నా ముందే నామినేషన్‌ వేయగా, రాహుల్‌ గాంధీ కేఈ మాత్రమే ఆ తర్వాత, అంటే ఏప్రిల్‌ 12వ తేదీన నామినేషన్‌ దాఖలు చేశారు. వీరితో పాటు వయనాడ్‌ నుంచి మొత్తం 22 మంది పోటీ పడగా, మంగళవారం నాడే పోలింగ్‌ జరిగింది. ఓటర్లు గాంధీల పేర్లు చూసి ఆశ్చర్యపడ్డారే తప్ప, గందరగోళ పడినట్లు ఫిర్యాదులు అందలేదు.

కాస్త పేరున్న రఘుల్‌ గాంధీకి ఆ పేరును జాతిపిత మహాత్మా గాంధీపైనున్న గౌరవంతో ఆయన తండ్రి పెట్టారట. ఆయన రాజకీయాలకు కొత్త కాదు. గతంలో, 2014లో కోయంబత్తూరు నుంచి మేయర్‌గా, 2016లో తమిళనాడు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఆయన కోరుకుంటే ఆయన అక్కడి నుంచే పోటీ చేయవచ్చు. చిత్రంగా రఘుల్‌ గాంధీ సోదరి పేరు ఇందిరా ప్రియదర్శిణి. వారి తండ్రి కృష్ణన్‌ పీ. ఆయన 30 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు. ఆయన తండ్రి పళనిస్వామి స్వాతంత్య్ర యోధుడు, కాంగ్రెస్‌ మద్దతుదారుడు.  

అయినప్పటికీ రాహుల్‌ గాంధీపై రఘుల్‌ గాంధీ పోటీ చేయడానికి ప్రధానంగా తన డిమాండ్లకు ప్రాచుర్యం కల్పించడం కోసం అట. 33 రాష్ట్ర భాషలకు అధికార హోదా కల్పించాలని, ముఖ్యంగా ద్రావిడ భాషలకు జాతీయ హోదా కల్పించాలన్నది ఆయన మొదటి డిమాండ్‌ అయితే అన్ని పన్నుల నుంచి పౌరులకు విముక్తి కల్పించడం ఆయన రెండవ నినాదమట. ఈ రెండు డిమాండ్ల పరిష్కారం కోసం రాహుల్‌ గాంధీతోపాటు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీతోని పోరాటం జరుపుతానని ఆయన చెప్పారు. 

వయనాడ్‌లో రాహుల్‌ గాంధీతో పాటు పోటీ పడుతున్న అభ్యర్థుల బ్యాలెట్‌ జాబితా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement