కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలన్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉండడమేనా? ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. వయనాడ్‌లో హిందువులతో పోల్చితే ముస్లిం ఓటర్లు ఎక్కువే కానీ, 50 శాతం కూడా లేరని ఓ అధ్యయనంలో తేలింది. కానీ, వయనాడ్‌లో కిందటి రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే గెలవడం, నియోజకవర్గంలో మెజారిటీ ఓటర్లు ముస్లింలే కావడం వల్లే రాహుల్ పోటీకి దిగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈశాన్య కేరళలో ప్రకృతి అందాలకు నెలవైన వయనాడ్ పశ్చిమ కనుమల్లో ఉంది. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక కలిసే ప్రాంతం. ఐదో దశలో (మే 6) పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని సొంత స్థానం అమేథీతో పాటు మూడో దశలో (ఏప్రిల్ 23) ఎన్నికలు జరిగే వయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నట్టు రాహుల్ ప్రకటించారు. అయితే, వయనాడ్‌లో పోటీ కారణంగా రాహుల్ అమేథీని వదులుకోరని, మొదటిసారి ఆయన రెండు సీట్ల నుంచి పోటీ చేస్తున్నారని మాత్రమే భావించాలని కాంగ్రెస్ వివరించింది. 2004 నుంచి రాహుల్ అమేథీ నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు. దక్షిణాది నుంచి కూడా పోటీ చేయాలనే కాంగ్రెస్ నేత నిర్ణయం అనేక ఊహాగానాలకు తెర తీసింది.
ఓటమి భయంతోనే వయనాడ్‌కు..: బీజేపీ
అమేథీలో గెలుపుపై ధీమా లేకనే రాహుల్ రెండో ‘సురక్షిత స్థానం’ ఎంపిక చేసుకున్నారని వయనాడ్‌పై పోటీ విషయం ప్రకటించగానే బీజేపీ ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు మెజారిటీ అనే ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది. కేరళ రాజకీయాలను బట్టి ముస్లింలు కాంగ్రెస్‌కే ఓటేస్తారనే అంచనాతో ఆయన దీన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానించాయి. కేరళలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే ముస్లింలీగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భాగస్వామ్యపక్షం కావడం, పాలక కూటమి (ఎల్డీఎఫ్)కు నాయకత్వం వహించే సీపీఎం కంటే మైనారిటీలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడం కూడా ఇలాంటి వ్యాఖ్యలకు దారితీసింది. ఎల్డీఎఫ్ భాగస్వామి సీపీఐ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీచేసింది. అందుకే, రాహుల్ ఇక్కడి నుంచి పోటీకి దిగడంతో కమ్యూనిస్ట్ పార్టీలు ఆయనపై విమర్శలు గుప్పించాయి. రాహుల్‌కు బీజేపీతో తలపడే ధైర్యం లేకే కమ్యూనిస్టులకు బలం ఉన్న వయనాడ్ నుంచి పోటీకి దిగుతున్నారని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ‘హిందూ ఉగ్రవాదం’ అనే మాటలు వాడడం వల్లే మెజారిటీ మతస్తుల ఆధిపత్యంలోని స్థానాల నుంచి కాంగ్రెస్, ఆ పార్టీ అధ్యక్షుడు పోటీ చేయడానికి భయపడుతున్నారని మహారాష్ట్రలో ఇటీవల ఎన్నికల సభలో మోదీ ఆరోపించారు. ‘మెజారిటీ మతస్తులు మైనారిటీగా ఉన్న చోటకు పోయి కాంగ్రెస్ నేత పోటీచేస్తున్నారు’ అని మోదీ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
మొదటి నుంచీ కాంగ్రెస్‌కే ఆధిపత్యం
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వయనాడ్ లోక్‌సభ స్థానం అవతరించింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లతో వయనాడ్ ఎంపీ స్థానం ఏర్పాటైంది. ఈ మూడు జిల్లాల్లో ఒక్క మలప్పురం జిల్లాలోనే ముస్లింలు అత్యధిక సంఖ్యలో(70 శాతానికి పైగా) ఉన్నారు. వయనాడ్ జిల్లాలోని మనంతవాడీ, సుల్లాన్‌బతేరీ, కాల్పేట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఈర్నాడ్, నీలంబూర్, వాండూర్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో ఉన్నాయి. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానవాజ్ ఇక్కడ గెలుపొందారు. రెండుసార్లూ సీపీఐ అభ్యర్థులను ఓడించారు. 2009లో సీపీఐ నేత ఎం.రహమతుల్లాను లక్షన్నరకు పైగా ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారు. ఎన్పీసీ తరఫున పోటీ చేసిన కె.మురళీధరన్‌కు 99 వేలకు పైగా ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో తన సమీప సీపీఐ అభ్యర్థి (సత్యన్ మోకేరీ)పై కాంగ్రెస్ నేత షానవాజ్ మెజారిటీ 20 వేలకు పడిపోయింది. బీజేపీ అభ్యర్థి పీఆర్ రస్మిల్‌నాథ్‌కు 80 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అంటే 2009–14 మధ్య కాంగ్రెస్ బలం తగ్గింది. 2009లో ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐపై కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభించింది. కానీ, 2014లో ఐదు స్థానాల్లోనే కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 41 శాతం, సీపీఐకి 39 శాతం ఓట్లు లభించాయి. రెండోసారి గెలిచిన షానవాజ్ కిందటేడాది మరణించారు.
ముస్లిం ఓటర్ల సంఖ్య సగానికి కంటే తక్కువే!
అందరూ చెబుతున్నట్టు వయనాడ్‌లోని మెజారిటీ ముస్లిం ఓటర్లే రాహుల్‌ను గెలిపిస్తారా? అనే ప్రశ్నకు జవాబు వెతికితే ముస్లింలు నియోజకవర్గ జనాభాలో సగం కంటే తక్కువేనని తెలుస్తోంది. జిల్లాల వారీగా చూస్తే వయనాడ్ జిల్లా జనాభాలో 49.5 శాతం హిందువులు, 28.8 శాతం ముస్లింలు, 21.5 శాతం క్రైస్తవులు ఉన్నారు. అయితే, ఈ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లే వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న కారణంగా ఈ జనాభా వివరాల వల్ల ప్రయోజనం లేదు. మూడు జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల జనాభా వివరాలను బట్టి చూస్తే వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో ముస్లింలు మిగిలిన రెండు మతాల జనం కన్నా ఎక్కువేగాని మొత్తం జనాభాలో సగానికి కొద్దిగా తక్కువే. ముస్లింలు 48 శాతం, హిందువులు 41 శాతం, క్రైస్తవులు 11 శాతం ఉన్నారని అంచనా. గతంలో రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి షానవాజ్ ముస్లిం. ముస్లింల మొగ్గు చాలా వరకు యూడీఎఫ్‌కే ఉన్నా కాంగ్రెస్ ఆ ఓట్లతోనే గెలిచిందని చెప్పలేం. 2009లో సీపీఐ అభ్యర్థి ముస్లిం కాగా, 2014 ఎన్నికల్లో సీపీఐ టికెట్‌పై పోటీచేసిన సత్యన్ మోకేరీ హిందువే అయినా కాంగ్రెస్ చేతిలో తక్కువ తేడాతో ఓడిపోయారు. ఇక్కడ గత రెండుసార్లూ కాంగ్రెస్ గెలుపునకు తన సమీప ప్రత్యర్థుల మతంతో సంబంధం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.
యూడీఎఫ్‌కే అనుకూల పవనాలు: సర్వేలు
ఈ నెల 23న పోలింగ్ జరిగే మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు సంబంధించి వివిధ మీడియా సంస్థలు జరిపిన సర్వేల్లో కాంగ్రెస్ కూటమికే 15కు పైగా సీట్లు వస్తాయని తేలింది. సీపీఎం కూటమికి 3–4కి మించి సీట్లు రావని కూడా కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2016లో అధికారంలోకి వచ్చింది. ప్రతి ఐదేళ్లకూ పాలక కూటములను మార్చే అలవాటున్న కేరళలో మూడేళ్ల పాలన తర్వాత పాలక కూటమి లోక్‌సభ ఎన్నికల్లో సగం కన్నా తక్కువ లోక్‌సభ సీట్లే దక్కించుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. శబరిమల అయ్యప్ప గుడిలో స్త్రీల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పుకు కమ్యూనిస్ట్ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఐదారు సీట్లకే పరిమితమౌతుందనే అంచనాలకు మరో కారణంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఖాయంగా గెలిచే వీలున్న స్థానమనే అంచనాతో వయనాడ్ నుంచి పోటీకి రాహుల్ నిర్ణయించుకున్నారు. అయితే, నియోజకవర్గంలో 48 శాతం ఓటర్లు ముస్లింలనే విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోకుండానే కాంగ్రెస్ దీన్ని ఎంపిక చేసుకుందని భావించడం పొరపాటే.
ముస్లింలు48%
హిందువులు41%
క్రైస్తవులు11%
Comments
Please login to add a commentAdd a comment