కశ్మీర్‌లో మళ్లీ హింస
* నలుగురు పౌరుల మృతి, పలువురికి గాయాలు
* 62కు చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: కశ్మీర్ ఇంకా రగులూతూనే ఉంది. మంగళవారం నాటి అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దీంతో నెలరోజుల పైగా సాగుతున్న హింసలో మృతుల సంఖ్య 62కు చేరింది. కర్ఫ్యూ, నిషేధాజ్ఞలు, వేర్పాటువాదుల బంద్‌తో మంగళవారం లోయలో సామాన్య జనజీవనం స్తంభించింది. బుద్గాం జిల్లా మాగంలో ఆందోళనకారులు సీఆర్‌పీఎఫ్ వాహనాలపై రాళ్లురువ్వడంతో భద్రతాదళాలు కాల్పులు జరిపాయి.
కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు అనంత్‌నాగ్ జిల్లా జంగ్లాట్ మండీలో రాళ్లదాడి చేస్తోన్న యువతను చెదగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. వారిలో అమిర్ యుసఫ్ కొద్దిసేపటి తర్వాత మరణించాడని అధికారులు తెలిపారు.
రాజ్‌నాథ్‌కు ఉన్నతాధికారుల వివరణ
కశ్మీర్‌లో తాజా హింసపై ఉన్నతాధికారులతో హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం సమీక్షించారు. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రిషి, నిఘా విభాగాల అధిపతులు రాజ్‌నాథ్‌కు వివరించారు. శాంతి పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని, ప్రజలు, భద్రతాదళాలకు ప్రాణనష్టం జరగకుండా చూడాలని హోం మంత్రి ఆదేశించారు.
అవసరమైతే రాజ్యాంగ ధర్మాసనానికి
1947-54 మధ్య పాక్‌కు వలసవెళ్లిన కశ్మీరీల పునరావాసానికి వీలుకల్పించే పునరావాస చట్టం చె ల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను అవసరమైతే రాజ్యాంగ బెంచ్‌కు సిఫార్సు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కొన్ని అంశాల్లో రాజ్యాంగ వివరణ తప్పనిసరైతే అప్పుడు నిర్ణయం తీసుకుంటామంది.