తండ్రి బాటలోనే సుప్రీం న్యాయమూర్తిగా..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య 29కి చేరింది. ఇంకా మరో రెండు ఖాళీలు ఉన్నాయి. జస్టిస్ ఏఎం ఖనివాకర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎల్ నాగేశ్వరరావు శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.
జస్టిస్ ఖనివాకర్ అంతకుముందు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయగా.. జస్టిస్ చంద్రచూడ అలహాబాద్ హైకోర్టుకు, జస్టిస్ భూషణ్ కేరళ హైకోర్టుకు ఉన్నత న్యాయమూర్తులుగా పనిచేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ కుమారుడు. ఆయన అప్పట్లో 1978 ఫిబ్రవరి 22 నుంచి.. 1985 జూలై 11 వరకు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఎల్ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు.