ఇంట్లోకి వచ్చాడని బాలుడికి వాతలు
కోయంబత్తూర్: సాధారణంగా చిన్న పిల్లల్లు ఇంట్లో వచ్చి ఆడుకుంటుంటే సంబరంగా ఉంటుంది. వారిని దగ్గరికి తీసుకొని ముద్దు చేయాలని పిస్తుంది. అవసరం అయితే, ప్రేమగా కొంచెం ఏదైనా తినిపించాలని ఉంటుంది. కాని, తమిళనాడులోని ఓ ఇంటి యజమానురాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. వేళకాని వేళలో తన ఇంట్లోకి వచ్చి నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటున్నాడని సహించ లేక ఇనుప చువ్వను ఎర్రగా కాల్చి వాతలు పెట్టింది. గుడ్లెర్ర జేసి బాలుడి దవడకు, చిట్టి అరిపాదాలకు అంటించింది. దీంతో ఆ బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ విషయం బాలల హక్కుల విభాగా అధికారులకు తెలిసి సీరియస్ అయ్యారు. విచారణ ప్రారంభించారు. దర్యాప్తు అనంతర అంశాల ప్రకారం ఆ యజమానురాలిపై చర్యలు తీసుకోనున్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కోయంబత్తూర్లోని పులియాకులం అనే ఊర్లో ఓ నాలుగేళ్ల బాలుడు ఓ అద్దె ఇంట్లో తన తాతయ్యనాయనమ్మతో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు తండ్రి తాగుడుకు బానిసగా మారాడన్న కారణంతో భార్య విడిచిపెట్టి వెళ్లింది. దీంతో తల్లి లేని ఆ బాలుడు తాతయ్యనాయనమ్మతో ఉంటూ ఓ రోజు ఆడుకుంటూ ఇంటి యజమానురాలి ఇంట్లోకి వెళ్లాడు. దీంతో ఆమె వేళకాని వేళ వచ్చి ఇంట్లో ఆడుకుంటున్నాడనే ఆక్రోశంతో చిన్నపిల్లాడని కూడా చూడకుండా వాతలు పెట్టింది. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడి నడవలేకుండా పోయాడు. తండ్రి ఫిర్యాదు మేరకు బాలల హక్కుల అధికారులు ఆ బాలుడిని పరామర్శించి విచారణకు ఆదేశించారు.