సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢ చర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై కొనసాగిన తప్పుడు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వడం తెల్సిందే. ఇంతకాలం ఆయనకు మనో వేదనను కలిగించినందుకుగాను నష్ట పరిహారంగా ఆయనకు 50 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా ఆ తీర్పులో సుప్రీం కోర్టు ఆదేశించింది. క్రయోజనిక్ రాకెట్ల తయారీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అమ్మారన్న అభియోగంపై నంబి నారాయణన్‌పై కేరళ పోలీసులు 1994లో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఇది తప్పుడు కేసుంటూ దిగువ కోర్టే కొట్టివేసింది. అయితే తగిన నష్టపరిహారం కోసం నంబి నారాయణన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఇదే కేసులో అరెస్టై 1998లో కేసు నుంచి విముక్తి పొందిన మిగతా ఆరుగురిలో ఒకరు మాజీ ఇస్రో శాస్త్రవేత్త కే. చంద్రశేఖర్.
సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన శుక్రవారం నాడు చంద్రశేఖర్ తీర్పు ఎలా వస్తుందో చూడాలని తీవ్ర ఉద్వేగానికి గురై కోమాలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేజే విజయమ్మ స్వయంగా మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు ప్రారంభం కాగా, ఆ రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ కోమాలోకి వెళ్లారు. ఆయన ఆదివారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో కొలంబియా ఆస్పత్రిలో మరణించారు. ఈ నకిలీ కేసులో సుప్రీం కోర్టు భారీ నష్ట పరిహారాన్ని ఇప్పిస్తుందని ఆశించిన చంద్రశేఖర్, తీర్పు వినేవరకు ఆగి ఉంటే తృప్తిగా వెళ్లేవారని ఆయన భార్య విజయమ్మ వ్యాఖ్యానించారు.
దేశంలో నకిలీ కేసులు ఇదొక్కటే కాదు. ఎన్నో ఉన్నాయి. వాటిలో చిక్కుకుని ఎంతో మంది ఎన్నో బాధలు అనుభవించారు. వాటిలో ఎక్కువ ముస్లింలపై దాఖలైన టెర్రరిస్టు కేసులే. నంబి నారాయణన్ కేసులో కూడా ఎవరో ఒక ముస్లిం పేరును వెల్లడించాల్సిందిగా ఐబీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారట. అప్పటికే ఇస్రోలో పనిచేస్తున్న అబ్దుల్ కలాం లేదా తన చిన్ననాటి మిత్రుడు అబూబేకర్ పేర్లను వెల్లడించినా ఫర్వాలేదని సూచించారట. ఈ విషయాన్ని ‘రెడీ టూ ఫైర్: హౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్, ది ఇస్రో స్పై కేసు’ పుస్తకంలో నారాయణన్ వెల్లడించారు. ఈ పుస్తకం గత ఏప్రిల్ పదవ తేదీన మార్కెట్‌లోకి వచ్చింది.
గుజరాత్ అక్షరధామ్ కేసు కూడా నకిలీదే!
2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయంపై దాడి చేశారన్న కేసును 2014లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టైన మొత్తం ఆరుగురు ముస్లింలు అమాయకులని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో బుద్ధి వక్రీకరించిందంటూ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది. 2008లో ఇద్దరు ఢిల్లీ ముస్లిం యువకులపై పోలీసులు టెర్రరిస్టులని ముద్రవేయడమే కాకుండా తప్పుడు సాక్ష్యాలను సృష్టించినందుకు ఢిల్లీ పోలీసులను సీబీఐ తీవ్రంగా మందలించింది. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు 2011లో కొట్టివేసింది. నలుగురు పోలీసు అధికారులు తమ వ్యక్తగత ప్రయోజనాల కోసం తప్పుడు కేసు బనాయించారని కోర్టు తీర్పు చెప్పింది. దేశంలో పలు సందర్భాల్లో మావోయిస్టులపై కూడా పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. వ్యక్తిగత కక్షల కోసం పోలీసులు నకిలీ కేసులు బనాయించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
2010లో ఢిల్లీ పోలీసులు ఓ వ్యక్తిపై 18 తప్పుడు కేసులు బనాయించారు. పర్యవసానంగా ఆ వ్యక్తి 16 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2014లో ఓ టాక్సీ డ్రైవర్‌పై పోలీసులు దాఖలు చేసిన తప్పుడు రేప్ కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అదే ఏడాది ఓ వ్యక్తిని హత్యకేసులో ఇరికించేందుకు ఓ పోలీసు అధికారి అఫీషియల్ డెయిరీని మార్చి వేశారు. ఈ కేసును కూడా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పోలీసులు దాఖలు చేసిన తప్పుడు కేసులు కోకొల్లలుగా తేలుతాయి. బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన పోలీసు చట్టాలను మార్చక పోవడం వల్లనే పోలీసులు తప్పుడు కేసులకు పాల్పడుతున్నారు.
తప్పుడు కేసులను బనాయించిన పోలీసులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నంబి నారాయణన్‌పై తప్పుడు కేసును బనాయించినందుకు 50 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించిన సుప్రీం కోర్టు, తప్పుడు కేసుకు బాధ్యులైన పోలీసులకు శిక్షను ప్రకటించి కొత్త చట్టాలకు స్ఫూర్తినిచ్చి ఉండాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment