కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్‌! | Fruits Are Healthy For Corona Patients | Sakshi
Sakshi News home page

‘ప్రతి’ ఫలాలెన్నో..!

Published Sun, Jun 28 2020 2:49 PM | Last Updated on Sun, Jun 28 2020 3:15 PM

Fruits Are Healthy For Corona Patients - Sakshi

పానీపూరీలు ఎప్పుడైనా తినొచ్చు.. ప్రస్తుతానికి నాలుగు నేరేడు పండ్లు పొట్టలోకి పంపుదాం. నూడుల్స్‌ రుచి తర్వాతైనా ఆస్వాదించవచ్చు.. ఇప్పటికి బత్తాయిల పని పడదాం. చాట్లు, బజ్జీలు చలికాలంలో తినొచ్చులే.. ఈ రోజుకు ద్రాక్ష, ఖర్జూరాలతో జిహ్వను ఊరుకోబెడదాం. సూపు బదులు నిమ్మరసం, సాధారణ టీ బదులు హెర్బల్‌ టీ.. కుండలో నీరు బదులు కాస్తంత అల్లం కలిపిన వేడినీరు. ఇలా చిన్న చిన్న మార్పులతో కరోనా కాలంలో వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు సైతం ఫలాలతో ప్రతిఫలాలెన్నో అంటూ సామాజిక మాధ్యమాల్లో వివరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఏ పండులో ఏముందో తెలుసుకుందాం.. 

నేరేడు పండ్లు 
గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా లభించే పండ్ల జాతుల్లో నేరేడు పండ్లది అగ్రస్థానం. ఈ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. కాలేయం పనితీరును క్రమబద్ధీకరించడానికి, శుభ్రపరచడానికి ఇవి దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్న సమయంలో ధనియాలు రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం, నేరేడురసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపితీసుకోవాలి. నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్పరస్, మాంగనీస్‌. జింక్, ఐరన్, విటమిన్‌ సి అధికంగా ఉంటాయి. 

బొప్పాయి.. 
బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్లు మరే పండ్లలో లేవని వైద్యులు అంటారు. విటమిన్‌ ఎ, బీ, సీ, డీలు తగిన మోతాదులో ఉంటాయి. తరచూ బొప్పాయిని ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్పిన్‌  అనే పదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. బొప్పాయి తినడం ద్వారా శరీరం ఉల్లాసంగా కూడా కనిపిస్తుంది.  


ఖర్జూరం.. 
ఏ పండైనా పండుగానే బాగుంటుంది. ఖర్జూరం మాత్రం ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలో నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది. సంప్రదాయ ఫలంగా కూడా ఖర్జూరానికి చాలా మంచి పేరుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేషం లాంటి వాటికి ఈ పండు గుజ్జు, సిరప్‌ మంచి ప్రయోజనకారి. 

పుచ్చ(వాటర్‌ మిలన్‌) 
వాటర్‌మిలన్‌(పుచ్చ) చాలా మందికి ఇష్టమైన పండ్ల జాతి. వేసవిలో వీటి వినియోగం ఎక్కువ. ఎండలో దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యత ఇచ్చేది పుచ్చకాయలే. వీటిని కాయలే అని అంటున్నప్పటికీ పండు మాత్రమే తినేందుకు ఉపయోగపడుతుంది. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది.

పనస 
పండ్ల జాతిలో అతి పెద్ద ఫలాలు ఇచ్చేది పనస చెట్టు మాత్రమే. ఒక పనసపండు 36 కిలోలు వరకూ కూడా ఉంటుంది. వైద్యపరంగా జీర్ణశక్తిని పనస పండు మెరుగుపరుచుతుంది. మలబద్దకం నివారిస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటును తగ్గిస్తుంది. విటమిన్‌ సి ఉన్నందున వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్‌ నివారణకు ఎంతో సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, పైటో న్యూట్రియంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నివారిస్తాయి. కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, పాస్పరస్, మెగ్నిషీయం, మాంగనీస్, జింక్‌ వంటి ఖనిజాలు పనసలో పుష్కలంగా ఉంటాయి.

 
దానిమ్మ 
దానిమ్మ పండ్ల ద్వారా శరీరానికి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి. రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. సంతాన సౌఫల్యతను పెంచే శక్తి దానిమ్మపండ్లలో ఉంది.
 
నారింజ 
నారింజ పండ్లలో రెండు రకాలు ఉన్నాయి. పుల్ల నారింజ, తీపి నారింజ, పుల్ల నారింజకాయలో నీరు అధికంగా ఉంటుంది. నారింజలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. కరోనా కట్టడికి బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలో దోహదపడుతుంది. గుండె బాగా పని చేసేటట్లు చేస్తుంది. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. నారింజలో  బీటా కెరోటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ అధికంగా ఉంటుంది.  

మామిడి.. 
మామిడిని పండ్ల రాజు అంటారు. మామిడిలో 15 శాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, తగిన శాతంలో విటమిన్‌ ఎ, బి, సి లతో పాటు కాల్షియం ఉంటుంది. మామిడి పండ్ల తినడం ద్వారా రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టవచ్చు. మామిడిపండ్ల నుంచి తీసిన పాలీఫెనోల్‌లో క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అరికట్టే గుణం ఉన్నట్లు నిపుణులు తెలిపారు.  

యాపిల్‌ 
పెక్టిన్‌ దండిగా ఉండే యాపిల్‌ పండ్లను తినడం వల్ల పేగులను ఆరోగ్యంగా ఉంచే బ్యాక్టీరియా సంఖ్య వృద్ధి చెందుతుంది. యాపిల్‌లో కొవ్వు పదార్థాలు అత్యల్పంగా ఉంటాయి. పొటాషియం అధికంగా, విటమిన్‌ సి అధికంగా ఉంటుంది.

పైనాపిల్‌.. 
సీతంపేట: జిల్లాలో అత్యధికంగా దొరికే ఫలాల్లో ఒకటి పైనాపిల్‌. మనకు చాలా సులభంగా దొరికే ఈ పండ్లతో ఎన్నో లాభాలుంటాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్‌లో ఉండే పొటాషియం, సోడియం నిల్వలు ఒత్తిడి, ఆందోళనల నుంచి రక్షణ ఇస్తాయి. మలబద్దకం, పచ్చకామెర్ల వంటి వ్యాధులకు పైనాపిల్‌ దివ్యమైన ఔషధం. ఇందులో నీరు 87.8 గ్రాములు, ప్రొటీన్‌లు 0.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రాములు, పిండి పదార్థం 10.8 గ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, పాస్పరస్‌ 9 మిల్లీగ్రాములు, ఇనుము 2.4 మిల్లీగ్రాములు, సోడియం 34.7 మిల్లీగ్రాములు, పొటాషియం 37 మిల్లీగ్రాములు, మాంగనీస్‌ 0.56 మిల్లీ గ్రాములు ఉంటాయని సీతంపేట వైద్యాధికారి నరేష్‌కుమార్‌ తెలిపారు.  


అరటిపండ్లు 
అరటి పండ్లలో 74 శాతం కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23 శాతం కార్బో హైడ్రేట్‌లు, 1 శాతం ప్రోటీనులు, 2.6 శాతం పైబరు ఉంటుంది. అరటి చాలా శక్తిదాయకమైనది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. శరీరంలో విష పదార్థాలను అరటిపండు తినడం ద్వారా తొలగించుకోవచ్చు.  

ద్రాక్ష.. 
ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా ద్రాక్ష సాగు ఉంది. ఇండ్లపై వీటిని పెంచుతున్నారు. వీటి వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల్లబద్దకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. విటమిన్‌ సి, కే ఎక్కువ. కిస్మిస్‌లు కూడా అంతులేని ఖనిజాలను అందిస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement