సాక్షి, హైదరాబాద్: పండ్లను అమ్మడానికి రైతులు సిద్ధంగా ఉన్నా కొనేవారు పెద్దగాలేరు. ఆ పండ్లను తినేవారున్నా వారు కొనలేని పరిస్థితి. ఇదీ కరోనా సృష్టించిన విచిత్ర పరిణామం. ఒకవైపు అకాలవర్షం.. మరోవైపు పడిపోయిన అమ్మకాలు.. ఫలితంగా మామిడి రైతుకు కష్టాలు, నష్టాలు వచ్చిపడ్డాయి. మామిడి అమ్మకాలు పుంజుకోవాల్సిన ఈ సమయంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో స్థానికంగా డిమాండ్ లేదు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే పరిస్థితి లేదు. ధరలు మరింత పతనమై, రైతుల కష్టాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
ఏ ఏ రకం.. ఎంతెంత విస్తీర్ణం..
♦ రాష్ట్రంలో మామిడితోటల పెంపకం 3.07 లక్షల ఎకరాల్లో ఉండగా, వీటిద్వారా 12.34 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి చేస్తున్నారు.
♦ భారీ డిమాండ్ ఉన్న బంగినపల్లి మామిడి రకం విస్తీర్ణం 80–85 శాతం కాగా, హిమాయత్, దసేరి, కేసరి, మల్లికా, రసాలు వంటివి మిగతా విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
అమ్మకాలెందుకు పడిపోయాయంటే..
♦ జగిత్యాల మామిడికి, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మామిడికి విశేష ఆదరణ
♦ గతంలో దేశ విదేశాలకు, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లకు మామిడికాయలను ఎగుమతి చేసేవారు.
♦ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇరవై ఐదు రోజులపాటు కురిసిన అకాల వర్షాలతో ఉత్పత్తి 8 లక్షల టన్నులకు తగ్గుదల
♦ పండిన కాస్త మామిడిని అమ్ముకుందామనే సమయంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధింపు
♦ ఎగుమతులు తగ్గడం, బేకరీలు, స్వీట్ దుకాణాల్లేక జామ్‌ల తయారీ లేకపోవడం, మామిడి తాండ్ర పరిశ్రమలు మూతబడటంతో నిలిచిన మామిడి కొనుగోళ్లు
♦ వ్యాపారం పెద్దగా లేక హోల్‌సేల్ వ్యాపారులెవ రూ వీటి కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు
ధరలు.. దిగుబడి ఇలా..
గత మే నెలలో మామిడి క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ.7 వేల ధర పలకగా, ఈసారి అది రూ.3 వేల నుంచి రూ.4 వేల మధ్యే ఉంది. రెండ్రోజుల కింద లాక్‌డౌన్ విధించడంతో రూ.3 వేలకు పడిపోయింది. మే నెలలో సాధారణంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు రోజూ 1,700–1,800 టన్నుల మేర మామిడిపండ్లు వచ్చేవి. ఈ సీజన్‌లో 1,400–1,500 టన్నులకు పడిపోగా, గురువారం కేవలం 500 టన్నులు మాత్రమే వచ్చాయి. ప్రతిరోజు ఉదయం 10 తర్వాత మార్కెట్లు మూసివేయడం, బయట జన సంచారానికి అనుమతివ్వకపోవడంతో రిటైల్ వ్యాపారం సాగడం లేదు.
ఇళ్ల వద్దకు చేరవేసే చర్యలేవీ?
గత ఏడాది ఇదే మాదిరి ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఉద్యాన శాఖ ఫోన్, ఆన్‌లైన్ బుకింగ్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకొని పోస్టల్ శాఖ ద్వారా జంట నగరాల్లోని వినియోగదారుల ఇంటివద్దకే మామిడి పండ్లను చేరవేసింది. గేటెడ్ కమ్యూనిటీ, కాలనీ వాసులకు బల్క్ ఆర్డర్లపైనా మామిడిపండ్లను సరఫరా చేసింది. మే నెలలో రోజుకు వెయ్యి ఆర్డర్ల వరకు వచ్చినా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. దీంతోపాటు హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్, జీడిమెట్ల ప్రాంతాల్లో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొబైల్ వాహనాల ద్వారా సైతం అమ్మకాలు చేపట్టింది. అయితే, ఈ ఏడాది అలాంటి చర్యలేవీ లేకపోవడంతో మామిడి రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
Mango Exports: మామిడి రైతులపై కరోనా ఎఫెక్ట్
Published Fri, May 14 2021 9:22 AM | Last Updated on Fri, May 14 2021 10:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment