
విమానంలో పొగలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. 154 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మధ్యాహ్నం 3.35 ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న ఇండిగో ఎయిర్‌బస్ ఏ-320 విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఎడమవైపు కింది భాగం నుంచి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసి) టవర్ సిబ్బంది దీన్ని గమనించి వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకు దింపారు. టాక్సీ వేలో ప్రయాణికులను దింపుతున్న సమయంలో 28 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఒకరికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. బుధవారం నాటి ఘటనపై ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు.