న్యూఢిల్లీ: జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించింది. రిపబ్లిక్ డే సన్నాహాల కారణంగా జనవరి 19 నుంచి 26 వరకు ఉదయం 10.20 గంటల నుంచి 12.45 వరకు విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పౌరవిమానయానశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కాగా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒకటి. రిపబ్లిక్‌డే వేడకల కోసం రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసారి వేడుకల్లో తొలిసారి సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్‌ఎఫ్) చెందిన మహిళా అధికారులతో మార్చ్ నిర్వహించనున్నారు. అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ మహిళా అధికారితోపాటుఇద్దరు సబార్డినేట్ ఆఫీసర్లు.. మొత్తం 144 మంది మహిళా BSF కానిస్టేబుళ్లకు నాయకత్వం వహించనున్నారు. గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో నిఘా పెంచారు.
కాగా భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించే ఈ భారీ పరేడ్‌కు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ప్రధాని మోదీ ఆహ్వానించగా.. ఇందుకు మెక్రాన్ కూడా అంగీకరించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘నా ప్రియమైన మిత్రుడు మోదీ.. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. మీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీతో వేడుకలను జరుపుకోవడానికి నేను వస్తున్నాను’ అని పేర్కొన్నారు.
చదవండి: బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టు బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment