ఢిల్లీ నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్‌మెంట్ ఫీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించారు.
గతంలో డొమెస్టిక్ విమానాలలో ప్రయాణించే వారి నుంచి యూడీఎఫ్‌ను రూ.275 నుంచి గరిష్టంగా రూ.550 వరకు తీసుకునేవారు. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.635 నుంచి గరిష్టంగా రూ.1,270 చెల్లించేవారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్లే విమాన ప్రయాణికులు సాధారణ యూడీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు నిజంగా శుభవార్తే. కొత్త చార్జీలతో డొమెస్టిక్ సర్వీస్ ప్రయాణికులకు రూ.233 నుంచి 466 వరకు ఆధా అవగా, ఇంటర్నేషనల్ సర్వీస్ ప్యాసింజర్స్‌కు రూ.518 నుంచి గరిష్టంగా రూ.1,048 వరకు భారం తగ్గనుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ 2015 డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిపాదన చేయగా రెండున్నరేళ్ల తర్వాత యూడీఎఫ్ ధరలు సవరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అధికారులు తెలిపారు.