user development fee
-
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫీజుల మోత
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన ప్రయాణాలు చేసేవారికి చార్జీలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్)ను పెంచుకునేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్)కు ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) అనుమతించడం ఇందుకు కారణం. 2022 ఏప్రిల్ 1 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వస్తాయి. 2021 ఏప్రిల్ నుంచి 2026 మార్చి దాకా వర్తించే మూడో కంట్రోల్ పీరియడ్‌కు సంబంధించి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదన ప్రకారం టారిఫ్‌లను సవరిస్తూ ఏఈఆర్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం దేశీ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూడీఎఫ్‌ను రూ. 480కి (ప్రస్తుతం రూ. 281), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికుల నుంచి వసూలు చేసే దాన్ని రూ. 700కి (ప్రస్తుతం రూ. 393) పెంచుకోవచ్చు. ఆ తర్వాత 2025 డిసెంబర్ 31 నాటికి దేశీ ప్రయాణికుల యూడీఎఫ్ రూ. 750 దాకా, విదేశీ ప్రయాణికులకు రూ. 1,500 దాకా యూడీఎఫ్ పెరుగుతుంది. -
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్ పెంచొద్దు
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) పెంచేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) చేసిన ప్రతిపాదనలపై దేశీ విమానయాన సంస్థల సమాఖ్య ఎఫ్ఐఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. కోవిడ్–19పరమైన ప్రతికూల పరిణామాలతో ఎయిర్‌లైన్స్ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో యూడీఎఫ్ పెంచడం సరికాదని, పెంపు ప్రతిపాదన అమలును వాయిదా వేయాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ)కి విజ్ఞప్తి చేసింది. థర్డ్ కంట్రోల్ పీరియడ్‌గా వ్యవహరిస్తున్న 2021 ఏప్రిల్–2026 మార్చి మధ్య కాలానికి టారిఫ్‌లను సవరించేందుకు అనుమతించాలంటూ ఏఈఆర్‌ఏకి జీహెచ్ఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశీయంగా ప్రయాణించే వారికి యూడీఎఫ్‌ను ప్రస్తుతమున్న రూ. 281 నుంచి ఏకంగా రూ. 608కి (116% అధికం), అంతర్జాతీయ రూట్ల ప్రయాణికులకు ప్రస్తుత రూ. 393 నుంచి రూ. 1300కి (231 శాతం) పెంపునకు అనుమతించాలని వీటిల్లో కోరింది. -
‘కొత్త’ రైల్వేస్టేషన్లలో యూజర్ చార్జీ!
న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులపై విధించేలాంటి యూజర్ చార్జీలను కొత్తగా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లలో విధించనున్నారు. దీంతో రైల్వే చార్జీల్లో కూడా పెంపు ఉంటుందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్) అనేది విమానాల్లో ప్రయాణికుడు చెల్లించే పన్నుల్లో భాగంగా ఉంటుంది. దీన్ని పలు ఎయిర్‌పోర్టుల్లో విధిస్తున్నారు. ఈవిధంగా వసూలు చేసే చార్జీ ఒక్కో స్టేషన్లో ఒక్కో రకంగా ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ ఇక్కడి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎంత చార్జీ వసూలు చేస్తామనే విషయం మంత్రిత్వ శాఖ త్వరలో తెలియజేస్తుందని అన్నారు. అమృత్సర్, నాగ్‌పూర్, గ్వాలియర్, సబర్మతి రైల్వే స్టేషన్లను రూ.1,296 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేయడంకోసం రైల్వే ప్రతిపాదనలు చేసిందన్నారు. ‘వసూలు చేసిన చార్జీ స్టేషన్ల ఆధునీకరణకు తోడ్పడుతుంది. చార్జీలు నామమాత్రంగానే ఉంటాయి’అని యాదవ్ పేర్కొన్నారు. -
ఢిల్లీ నుంచి వెళ్లే ప్యాసింజర్లకు శుభవార్త
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే ప్యాసింజర్లకు శుభవార్త. ఇకపై ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశీయ, విదేశీ సర్వీసులలో ప్రయాణించే వ్యక్తుల నుంచి తీసుకునే యూజర్ డెవలప్మెంట్ ఫీ (యూడీఎఫ్)ను తగ్గించారు. డొమెస్టిక్ సర్వీసుల్లో ప్రయాణించే ప్యాసింజర్స్ ఇక నుంచి కేవలం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు రూ.45 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారికంగా ప్రకటించారు. గతంలో డొమెస్టిక్ విమానాలలో ప్రయాణించే వారి నుంచి యూడీఎఫ్‌ను రూ.275 నుంచి గరిష్టంగా రూ.550 వరకు తీసుకునేవారు. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు రూ.635 నుంచి గరిష్టంగా రూ.1,270 చెల్లించేవారు. ఇక ఢిల్లీ నుంచి వెళ్లే విమాన ప్రయాణికులు సాధారణ యూడీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి రావడం ప్రయాణికులకు నిజంగా శుభవార్తే. కొత్త చార్జీలతో డొమెస్టిక్ సర్వీస్ ప్రయాణికులకు రూ.233 నుంచి 466 వరకు ఆధా అవగా, ఇంటర్నేషనల్ సర్వీస్ ప్యాసింజర్స్‌కు రూ.518 నుంచి గరిష్టంగా రూ.1,048 వరకు భారం తగ్గనుంది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరి అథారిటీ 2015 డిసెంబర్ నెలలోనే ఈ ప్రతిపాదన చేయగా రెండున్నరేళ్ల తర్వాత యూడీఎఫ్ ధరలు సవరించారని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అధికారులు తెలిపారు.