సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజు తీవ్ర రూపం దాలుస్తున్న మావోయిస్టుల కార్యకలాపాలకు చమరగీతం పాడేందుకు ఫ్రెంచ్ తయారి ‘హెచ్–145’ అత్య«ధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా ఈ అత్య«ధునిక హెలికాప్టర్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన డైరెక్టర్‌కు చెందిన ముగ్గురు సీనియర్ పైలెట్లను శిక్షణ నిమిత్తం జర్మనీకి పంపించనుంది. జర్మనీలోని డోనవర్థ్–మాన్‌చింగ్‌లో ఈ ముగ్గురు పైలెట్లకు 75 రోజుల పాటు కఠోర శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా నక్సలైట్ల ప్రాబల్యమున్న అలాగే అటవి ప్రాంతాల్లో హెలికాప్టర్‌ను ఎలా నడపాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కేవలం శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.7.30 లక్షలు ఖర్చు చేయనుంది.
శిక్షణ కోసం విదేశాలకు వెళ్లే ముగ్గురిలో చీఫ్ పైలెట్ క్యాప్టన్ సంజయ్ కర్వే, సీనియర్ పైలెట్ క్యాప్టన్ మహేంద్ర దల్వీ, అసిస్టెంటెంట్ పైలెట్ క్యాప్టన్ మోహిత్ శర్మ ఉన్నారు. వీరంత జూన్ ఐదో తేదీన జర్మనికి బయలుదేరుతారు. అక్కడ 75 రోజులపాటు కఠోర శిక్షణ తీసుకున్న తరువాత ఆగస్టు 14వ తేదీ తరువాత తిరిగి స్వరాష్ట్రానికి చేరుకుంటారు. కేవలం అత్యధునిక హెలికాప్టర్ కొనుగోలు చేయగానే సరిపోదు. దాన్ని నడిపే సత్తా ఉండాలనే ఉద్ధేశ్యంతో ముగ్గురు పైలెట్లను ఎంపిక చేసి శిక్షణ కోసం జర్మనీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నక్సలైట్ల కార్యకలాపాలను అంతమొందించేందుకు చేపట్టే గాలింపు చర్యల పనుల కోసం గత ఎనిమిదేళ్లుగా పవన్ హంస్ కంపెనీకి చెందిన హెలికాప్టర్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.25 కోట్లు చెల్లిస్తుంది. దీంతో సొంతంగా ఒక అత్యధునిక హెచ్–145 మోడల్ హెలికాప్టర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎయిర్ బస్ హెలికాప్టర్ కంపెనీ నుంచి రూ.72.43 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఇందులో ఇద్దరు పైలెట్లు, పది మంది ప్రయాణించే సామర్ధ్యం ఉంటుంది. మావోలను ఏరివేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు సాయం అందించేందుకు కూడా దీన్ని వినియోగించవచ్చు. అందుకు ప్రధాన కారణం ఇందులో స్ట్రేచర్‌తోపాటు బాధితులకు అందజేసే రకరకాల మందులు, ఇతర వైద్య సామాగ్రి నిల్వచేసే సౌకర్యం ఉంది.
గగనతలం నుంచి దృష్టి సారించేందుకు
రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇటీవల జరిగిన దాడిని బట్టి మావోలు క్రియశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దాడులకు, పోలీసును అంతమొందించేందుకు కొత్త కొత్త విధానాలను ఎంచుకుంటున్నారు. కారడవిలో దట్టమైన చెట్ల మధ్య మావోలను గుర్తించాలంటే పోలీసులకు దారి లభించదు. ఇలాంటి సందర్భంలో గగనతలంలోంచి దృష్టి సారించడానికి ఈ హెలికాప్టర్ ఎంతో దోహదపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment