యువతిపై సామూహిక అత్యాచారం: ఫేస్బుక్లో వీడియో!
ఉత్తరప్రదేశ్‌లో ఓ యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను సామాజిక వెబ్‌సైట్‌లో పెట్టారు. మీరట్‌కు చెందిన 20 ఏళ్ల యువతి తనపై ఎనిమిది మంది యువకులు ఏడాది క్రితం అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురించి ఎవరికైనా చెపితే వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించారు. అయితే ఇప్పుడు ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించినట్టు ఆ యువతి తెలిపింది.
గత ఏడాది ఆగస్టులో ఒక స్నేహితునితో కలసి బాధితురాలు బసాదా గ్రామానికి వెళ్లింది. ఆ సమయంలో వారితో మరో నలుగురు యువకులు జత కలిశారు. ఆమెను అక్కడి నుంచి ఓ చోటుకి తీసుకెళ్లగా, అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. వీరంతా కలసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాక ఆ దశ్యాలను వీడియో తీశారు. ఈ విషయం ఎవరికైనా చెపితే ఆ వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించారు. దాంతో భయపడి ఆమె ఎవరికీ చెప్పలేదు. ఈమధ్యే ఆ వీడియోను ఫేస్ బుక్‌లో చూసిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఎస్‌పీ హెచ్‌ఎన్ సింగ్ చెప్పారు. రషీద్, వాసిక్, అబ్దుల్ రహమాన్, మోను, రాహుల్, సలావ్, అబుల్, షోకన్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.