జర్నలిస్టు గౌరవ్ సావంత్ (ట్విటర్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘మీటూ’ ఉద్యమ సెగ ప్రస్తుతం ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గౌరవ్ సావంత్‌ను కూడా తాకింది. పదిహేనేళ్ల క్రితం గౌరవ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ మహిళా జర్నలిస్టు విద్యా కృష్ణన్ ఆరోపించారు. ఈ క్రమంలో గౌరవ్ ఆమెతో ప్రవర్తించిన తీరును వివరిస్తూ ‘ద కారవాన్’ మ్యాగజీన్ కథనం ప్రచురించడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. కాగా విద్యా ఆరోపణలను ఖండించిన గౌరవ్.. కారవాన్ కథనాన్ని తప్పుబట్టారు. తనపై అసత్య ఆరోపణలు ప్రచారం చేసినందుకుగాను ఆ మ్యాగజీన్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.
The article published by Caravan is irresponsible, baseless, and completely false. I am talking to my lawyers and will take full legal action. So grateful to my family, friends, and viewers for their support.
— GAURAV C SAWANT (@gauravcsawant) November 12, 2018
గదిలోకి వచ్చి చాలా అసభ్యంగా ప్రవర్తించాడు..
‘అది నా మొదటి అవుట్ స్టేషన్ అసైన్‌మెంట్. అందులో భాగంగా పంజాబ్‌లోని బియాస్ మిలిటరీ స్టేషన్‌లో భారత ఆర్మీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాను. ఆ సమయంలో గౌరవ్ డిఫెన్స్ కరస్పాండెంట్‌గా ఉన్నాడు. అతడు కూడా నేను వెళ్లిన కార్యక్రమానికి వచ్చాడు. అందులో భాగంగా మేము ఒకే వాహనంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఆ సమయంలో నా వెనుక నుంచి భుజంపై చేయి వేసిన గౌరవ్.. ఒళ్లంతా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో నాకు చాలా భయం వేసింది. ఈ విషయం ఎవరితో చెప్పాలో అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్లీ నార్మల్‌గానే ప్రవర్తించాడు.
మళ్లీ ఏమయ్యిందో తెలీదు.. ఆరోజు రాత్రి నా హోటల్ గది ముందు వచ్చి నిలబడ్డాడు. బెల్ కొట్టగానే తెరిచాను. ఎందుకు వచ్చారని అడిగే లోపే లోపలికి వచ్చేశాడు. మీరు స్నానం చేస్తారా నేను కంపెనీ ఇవ్వాలా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. ఆ తర్వాత వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కానీ ఆ సమయంలో నేను గట్టిగా అరవడంతో కాస్త వెనక్కి తగ్గాడు. హోటల్ సిబ్బందిని పిలుస్తానని బెదిరించడంతో గది నుంచి వెళ్లి పోయాడు’ అంటూ ‘ద హిందూ’ హెల్త్ మాజీ ఎడిటర్ విద్యా కృష్ణన్ తను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి కారవాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇటువంటి విషయాలు బయటపెడితే వృత్తిపరంగా ఎదిగేందుకు అవరోధాలు ఎదురవుతాయని తనకు తెలుసనని.. అయితే ఆరోజు తాను నోరు మూసుకుని ఉండటానికి ప్రధాన కారణం ఆనాటి సామాజిక పరిస్థితులేనని ఆమె తన అసహాయత గురించి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండియా టుడే వివరణ
తమ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గౌరవ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇండియా టుడే యాజమాన్యం స్పందించింది. ‘గౌరవ్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పిన సమయంలో అతడు మా సంస్థలో లేడు. ఆర్టికల్‌పై ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. అయితే ఈ విషయంపై మేము అతడిని వివరణ కోరాం. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన గౌరవ్ చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యానని చెప్పారు’ అని మరో జాతీయ మీడియాతో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment