తండ్రితో మల్లికా దువా
‘ఇది మీకు మీరుగా పోరాడాల్సిన విషయం. నన్నెందుకు ఇందులోకి లాగుతారు. నేను ఎదుర్కొన్న వేధింపుల గురించి సమయం వచ్చినపుడు బయటపెడతా. అది పూర్తిగా నాకు సంబంధించిన విషయం. ఒకవేళ మా నాన్న నిజంగా తప్పు చేసి ఉంటే అది ఆమోదించదగిన విషయం కాదు. వినడానికి చాలా బాధాకరంగా ఉంది. నేను ఎల్లప్పుడూ బాధితుల తరపునే నిలబడతాను. ఇప్పుడు కూడా అంతే. అందుకే మా నాన్నకు మద్దతుగా నిలుస్తున్నా’ అంటున్నారు జర్నలిస్టు వినోద్ దువా కుమార్తె, ప్రసిద్ధ కమెడియన్ మల్లిక దువా. తన తండ్రిపై వేధింపుల ఆరోపణలు చేసిన ఫిల్మ్ మేకర్ నిశితా జైన్‌ను ఉద్దేశించి మల్లిక ఈవిధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
కూతురికి ఓ న్యాయం.. నాకొక న్యాయమా?
‘తన కూతురి(మల్లికా దువా)ని ఉద్దేశించి అక్షయ్ కుమార్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినపుడు వినోద్ దువా పదునైన పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే.. వినోద్ ఓ రేపిస్టు కంటే కూడా ఏమంత తక్కువ కాదు. ఆయన వల్ల లైంగిక వేధింపులకు గురైన వారి గురించి బహుశా మర్చిపోయి ఉంటారు. ఆయన నాతో అలా ప్రవర్తించారంటే మిగతా మహిళలను వేధించి ఉంటారు. కానీ ఈరోజు లైంగిక వేధింపులు అంటే ఏమిటి అన్న అంశంపై ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఓ సారి గతాన్ని గురించి గుర్తు చేసుకుంటే మంచిది’ అంటూ నిశితా తన మీటూ స్టోరీని షేర్ చేశారు.
అంతేకాకుండా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మల్లికా దువా బయటపెట్టాలంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. ‘కేవలం మీ వినోదం కోసం నేను మాట్లాడాలా’ అంటూ మల్లికా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మల్లిక పోస్టుకు స్పందించిన నిశితా ఆమెకు సారీ చెబుతూ మరో పోస్టు పెట్టారు. ఆ తర్వాత వెంటనే.. ‘వ్యక్తిత్వం లేని తండ్రులకు, క్రూరులైన భర్తలకు కొందరు మహిళలు మద్దతునిస్తారు. మీటూ కన్నా ఇలాంటివి తొందరగా వ్యాప్తి చెందుతాయి’ అంటూ మరోసారి అసహనం వెళ్లగక్కారు. కాగా ‘మేకప్ దీదీ’గా గుర్తింపు పొందిన మల్లిక.. గతేడాది.. ఓ టీవీ షోలో భాగంగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తనను ఉద్దేశించి అభ్యంతర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment