గౌరీ లంకేష్ హత్యః ఆ రోజు ఏం జరిగిందంటే..
తనను కాల్చి చంపిన కిల్లర్‌ను జర‍్నలిస్ట్ గౌరీ లంకేష్ నేరుగా చూసినట్టు సీసీటీవీ ఇమేజ్‌లను పరిశీలించిన సిట్ వర్గాలు తెలిపాయి.
సాక్షి,బెంగళూర్: తనను కాల్చి చంపిన కిల్లర్‌ను జర‍్నలిస్ట్ గౌరీ లంకేష్ నేరుగా చూసినట్టు సీసీటీవీ ఇమేజ్‌లను పరిశీలించిన సిట్ వర్గాలు తెలిపాయి. గౌరీ తొలుత తన ఇంటి తలుపు తీసి ఆయుధంతో తనను పిలిచిన కిల్లర్‌ను గమనించింది...వెనువెంటనే దుండగుడు ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు..మొదటి బుల్లెట్ ఆమె కుడి పక‍్కటెముకలోకి దూసుకుపోగా, రెండవ బుల్లెట్ ఎడమ పక్కటెముకకు తాకింది.
తర్వాత రెండు అడుగులు వెనకకు వేసి రూమ్‌లో అటూ ఇటూ పరుగెత్తిన గౌరీపై మరుక్షణమే రెండడుగులు ముందుకొచ్చిన కిల్లర్ కాల్పులు జరపగా మూడో బుల్లెట్ గురితప్పింది..నాలుగో బుల్లెట్ ఆమె వెన్నులో నుంచి దూసుకెళ్లి ఛాతీనుంచి బయటకు వచ్చిందని సిట్ వర్గాలు చెప్పాయి. నాలుగో బుల్లెట్ అనంతరం ఆమె 30 నుంచి 60 సెకన్లు మాత్రమే ప్రాణాలతో ఉండి ఉంటారని పేర్కొన్నాయి.