పాస్‌వర్డ్‌ చిక్కుముడి | Silencing a voice will only make it stronger: Prakash Raj | Sakshi
Sakshi News home page

పాస్‌వర్డ్‌ చిక్కుముడి

Published Fri, Sep 8 2017 8:50 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

గౌరిలంకేష్‌ సమాధి వద్ద తల్లి, తోబుట్టువులు, ప్రకాష్‌రాజ్‌ - Sakshi

గౌరిలంకేష్‌ సమాధి వద్ద తల్లి, తోబుట్టువులు, ప్రకాష్‌రాజ్‌

గౌరిలంకేష్‌ హత్య కేసులో సిట్‌ విచారణ
ఇంటి ముందున్న రెండు సీసీ కెమెరాల్లో కీలక చిత్రాలు
పాస్‌వర్డ్‌ వల్ల ఆటంకాలు


సాక్షి, బెంగళూరు:
ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరి  లంకేష్‌ హత్యకేసులో దర్యాప్తు వేగంగా సాగడానికి అధికారులకు రెండు సీసీ కెమెరాల పాస్‌వర్డ్‌లు అడ్డుపడుతున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గౌరిలంకేష్‌ను రాజరాజేశ్వరి నగరలోని ఆమె ఇంటి వద్దే దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా సిట్‌ బృందం ఆమె ఇంటి వద్ద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాల చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తుపాకితో గురిచూసి కాల్చే సమయంలో వ్యక్తి, అతనికి సహకారం అందించినవారు కనీసం అరనిమిషం పాటు నిల్చొనే ఉంటారు. ఘటనకు ఆ సీసీ కెమెరాలు దగ్గరగా ఉండడం వల్ల చిత్రాలు స్పష్టంగా ఉంటాయని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఆ ఫుటేజీలు బయటకు రావడం లేదని సమాచారం. మొత్తం నాలుగు కెమెరాల చిత్రాల్లో రెండింటివి చూశారు, మిగిలిన రెండింటి కెమెరాల ఫుటేజీల్లోకి వెళ్లడానికి గౌరిలంకేష్‌ పాస్‌వర్డ్‌ పెట్టారని, దాన్ని డీకోడ్‌ చేయడం పై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.

నెంబర్‌ ప్లేట్‌ కీలకం
ఇదిలా ఉండగా సంఘటన జరిగిన సమయం రాత్రి 7:45 నుంచి 8 గంటలు. ఆ సమయంలో బెంగళూరు వాతావరణం మబ్బులు పట్టీ చినుకులు కూడా పడుతుండటంతో సరైన వెలతురు లేదు. దుండగుల బైక్‌ సీసీ కెమెరాల చిత్రాల్లో కనిపిస్తున్నా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను గుర్తించడం ఖాకీలకు కష్టసాధ్యంగా మారింది. సమస్య పరిష్కారం కోసం పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్‌ అధికారుల సహకారం కోరినట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా పాస్‌వర్డ్‌ను డీ కోడ్‌చేయడంతో పాటు నైట్‌ విజన్‌ డిజిటల్‌ టెక్నాలజీతో నంబర్‌ ప్లేట్‌పైనున్న అక్షరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఆ ఆయుధం మావోయిస్టులదేనా?
హత్యాస్థలంలో దొరికిన ఖాళీ తూటా (కాట్రిడ్జ్‌)ను చూస్తే, హత్యాయుధం 7.35 ఎంఎం పిస్టల్‌గా పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. గతంలో లొంగిపోయిన కొందరు మావోయిస్టులు ఈ పిస్టళ్లనే పోలీసులకు అప్పజెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో హత్య వెనుక మావోయిస్టుల హస్తం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇవి కేవలం ప్రాథమికంగా ఆధారాలు మాత్రమేనని, దర్యాప్తు సాగిన కొద్ది కొత్తవిషయాలు కూడా వెలుగులోకి రావచ్చునని సిట్‌ బృందంలోని డీఎస్పీ స్థాయి అధికారి ఒకరు చెప్పారు.

అంత్యక్రియలకు మావోయిస్టుల హాజరు
గౌరి లంకేష్‌కు మావోయిస్టు సానుభూతి పరులారన్న పేరున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సిరిమనే నాగరాజు వంటి అగ్రస్థాయి నాయకులు జనజీవన శ్రవంతిలోకి రావడానికి ఆమె విశేషంగా కృషి చేశారు. ఎంతోమందితో పరిచయాలూ ఉన్నాయి. బుధవారం సాయంత్రం జరిగిన గౌరిలంకేష్‌ అంత్యక్రియలకు దాదాపు 15 మంది మావోయిస్టులు రహస్యంగా హాజరయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ ఎలక్ట్రానిక్‌ మీడియా ఫుటేజీలతో పాటు మఫ్టీలో పోలీసులు అత్యాధునిక కెమరాలతో తీసిన వీడియో రికార్డ్స్‌ను పరిశీలించిన సిట్‌ బృందం ఈ నిర్థారణకు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ కేసు విషయమై పనిచేస్తున్న సిట్‌బృందంలోని దాదాపు పదిమంది గతంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాభల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement