నల్లధనంపై నేడే ‘సిట్’ భేటీ
న్యూఢిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సిట్ అధినేత, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో సిట్ వైస్ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్‌తోపాటు 11 ఉన్నత విభాగాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. నల్లధనంపై ప్రభుత్వ విధానం, ఇప్పటివ రకు జరిగిన దర్యాప్తుల్లో వెలుగుచూసిన అంశాలు, బ్లాక్‌మనీకి సంబంధించి వివిధ విభాగాల వద్ద ఉన్న సమాచారంపై ఇందులో చర్చించనున్నారు. తమ దర్యాప్తుల్లో వెల్లడైన సమగ్ర సమాచారంతో ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆయా విభాగ ఉన్నతాధికారులను కోరారు.
హసన్ అలీ ఉదంతంతోపాటు నల్లధనానికి సంబంధించిన ఇతర కేసులూ భేటీలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే విచారణ మొదలైన, పెండింగ్‌లో ఉన్న, మొదలు కావాల్సిన, లేదా పూర్తయిన అన్ని కేసులపైనా సిట్‌కు న్యాయ పరిధి ఉంటుందని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం తెలిపింది. తన పనితీరు, కేసుల పురోగతిపై సిట్ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికలు సమర్పించనుంది. సిట్ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో రెవెన్యూ విభాగం కార్యదర్శి, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) డెరైక్టర్, సీబీఐ డెరైక్టర్, సీబీడీటీ చైర్మన్, జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెరైక్టర్, ‘రా’ కార్యదర్శి, ఆర్థికశాఖ (విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన) సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొనున్నారు.