MB Shah
-
తీవ్ర నేరంగా పరిగణించాలి
పన్ను ఎగవేతపై సిట్ న్యూఢిల్లీ: పన్ను ఎగవేతను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్ ఎంబీ షా అన్నారు. విదేశాల్లో అక్రమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను ఆయా దేశాలు వెల్లడించేలా ఒత్తిడి పెంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పించాలనే భారత్ లక్ష్యానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు దేశంలో సైతం అక్రమ సంపద పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని అన్నారు. పన్ను ఎగవేత భారత్‌లో ప్రస్తుతం సివిల్ నేరంగా ఉందని, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు ఫెమా (విదేశీ మారక నిర్వహణ చట్టం) కిందకి వస్తుండగా.. పన్ను ఎగవేతను ఆదాయ పన్ను చట్టం (1961) కింద ఎదుర్కోవడం జరుగుతోందని షా వివరించారు. స్వభావరీత్యా రెండూ సివిల్ చట్టాలేనని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అవకాశం ఉన్నవి కాదని సిట్ చైర్మన్ పీటీఐతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేతను తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించాలని తాము గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. పన్ను సంబంధిత నేరాలు సివిల్ స్వభావాన్నే కలిగివున్న పక్షంలో విదేశీ ప్రభుత్వాలు సహకరించవని అన్నారు. తీవ్రమైన నేరంగా కనుక చేస్తే.. విదేశాలు నల్ల కుబేరుల పేర్లు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. సుప్రీం మాజీ న్యాయమూర్తులు ఎంబీ షా, అరిజిత్ పసాయత్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్.. ఇటీవల నల్లధనంపై తాజా నివేదికను అందజేసింది. -
నల్లధనంపై దర్యాప్తు వేగవంతం
సిట్ తొలి సమావేశంలో నిర్ణయం న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తునకు కేంద్రం నియమించిన ప్రత్యేక విచారణ బృందం(సిట్) తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి. షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్లధనానికి సంబంధించిన కేసులను వేగంగా చేపట్టడంపై పరిశీలన జరపాలని నిర్ణయించారు. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. రెండు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ జరిగిందని, రోడ్ మ్యాప్ ఖరారైందని వెల్లడించింది. అయితే, ఆ రోడ్ మ్యాప్ (అనుసరించాల్సిన ప్రణాళిక) ఏమిటన్నది చెప్పలేదు. తదుపరి సమావేశం త్వరలోనే జరుగుతుందని ప్రకటించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలు చేపట్టిన నల్లధనం, మనీలాండరింగ్ కేసుల వివరాలు, ప్రగతి గురించి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమవేశంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సిట్ వైస్ చైర్మన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరిజిత్పసాయత్, ఐబీ సహా 11 కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నల్లధనంపై నేడే ‘సిట్’ భేటీ
న్యూఢిల్లీ: విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీతపై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సిట్ అధినేత, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబీ షా నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో సిట్ వైస్ చైర్మన్ జస్టిస్ అరిజిత్ పసాయత్తోపాటు 11 ఉన్నత విభాగాలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. నల్లధనంపై ప్రభుత్వ విధానం, ఇప్పటివ రకు జరిగిన దర్యాప్తుల్లో వెలుగుచూసిన అంశాలు, బ్లాక్‌మనీకి సంబంధించి వివిధ విభాగాల వద్ద ఉన్న సమాచారంపై ఇందులో చర్చించనున్నారు. తమ దర్యాప్తుల్లో వెల్లడైన సమగ్ర సమాచారంతో ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆయా విభాగ ఉన్నతాధికారులను కోరారు. హసన్ అలీ ఉదంతంతోపాటు నల్లధనానికి సంబంధించిన ఇతర కేసులూ భేటీలో చర్చకు రానున్నాయి. ఇప్పటికే విచారణ మొదలైన, పెండింగ్‌లో ఉన్న, మొదలు కావాల్సిన, లేదా పూర్తయిన అన్ని కేసులపైనా సిట్‌కు న్యాయ పరిధి ఉంటుందని ఆర్థికశాఖలోని రెవెన్యూ విభాగం తెలిపింది. తన పనితీరు, కేసుల పురోగతిపై సిట్ ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు స్థాయీ నివేదికలు సమర్పించనుంది. సిట్ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఈ తొలి సమావేశంలో రెవెన్యూ విభాగం కార్యదర్శి, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) డెరైక్టర్, సీబీఐ డెరైక్టర్, సీబీడీటీ చైర్మన్, జనరల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డెరైక్టర్, ‘రా’ కార్యదర్శి, ఆర్థికశాఖ (విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన) సంయుక్త కార్యదర్శి తదితరులు పాల్గొనున్నారు. -
‘నల్లధనం’పై సిట్‌కు వారం గడువు
‘బ్లాక్‌మనీ’ సమాచారాన్ని ప్రతివాదులకు ఇవ్వాలి: సుప్రీం న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి.షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందా(సిట్)న్ని ఏర్పాటు చేయటానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో వారం రోజుల సమయం ఇచ్చింది. నల్లధనం కేసులపై సిట్ నియామకానికి సంబంధించి మూడు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు మే 1వ తేదీన కేంద్రానికి నిర్దేశించిన విషయం తెలిసిందే. దేశంలోనూ, విదేశాల్లోనూ నల్లధనం కేసుల దర్యాప్తులో మార్గదర్శనం, పర్యవేక్షణ కోసం ఏర్పాటయ్యే ఈ సిట్ చైర్మన్‌గా మాజీ జడ్జి ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా మరో మాజీ జడ్జి అరిజిత్పసాయత్లను కూడా కోర్టు అప్పుడే నియమించింది. జర్మనీలోని లీక్టెన్స్టీన్లో గల ఎల్ఎస్టీ బ్యాంకులో పలువురు భారతీయులు నల్లధనం దాచారన్న ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో భాగంగా సేకరించిన పత్రాలు, సమాచారం మొత్తాన్నీ.. ఈ అంశంపై పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తదితరులకు అందించాలని కూడా అప్పుడు ఆదేశించింది. సిట్ ఏర్పాటుకు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసిన నేపథ్యంలో తాజాగా జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.కె.సిక్రిల నేతృత్వంలోని ధర్మాసనం మరో వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే.. నల్లధనానికి సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు శాస్త్రిభవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయని సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ ఆరోపించటంతో.. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ రెవెన్యూ విభాగంలోని కార్యదర్శి స్థాయి అధికారి సంరక్షణలో ఉంచాలని కూడా ధర్మాసనం నిర్దేశించింది. అయితే.. జెఠ్మలానీ ఆరోపణలను సొలిసిటర్ జనరల్ మోహన్పరాశరన్ ఖండించారు. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ నార్త్‌బ్లాక్‌లో ఉంచటం జరిగిందని, శాస్త్రిభవన్‌లో కాదని ఎస్జీ పేర్కొన్నారు.