‘నల్లధనం’పై సిట్‌కు వారం గడువు
‘బ్లాక్‌మనీ’ సమాచారాన్ని ప్రతివాదులకు ఇవ్వాలి: సుప్రీం
న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి.షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందా(సిట్)న్ని ఏర్పాటు చేయటానికి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మరో వారం రోజుల సమయం ఇచ్చింది. నల్లధనం కేసులపై సిట్ నియామకానికి సంబంధించి మూడు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని సుప్రీంకోర్టు మే 1వ తేదీన కేంద్రానికి నిర్దేశించిన విషయం తెలిసిందే. దేశంలోనూ, విదేశాల్లోనూ నల్లధనం కేసుల దర్యాప్తులో మార్గదర్శనం, పర్యవేక్షణ కోసం ఏర్పాటయ్యే ఈ సిట్ చైర్మన్‌గా మాజీ జడ్జి ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా మరో మాజీ జడ్జి అరిజిత్‌పసాయత్‌లను కూడా కోర్టు అప్పుడే నియమించింది. జర్మనీలోని లీక్టెన్‌స్టీన్‌లో గల ఎల్‌ఎస్‌టీ బ్యాంకులో పలువురు భారతీయులు నల్లధనం దాచారన్న ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తులో భాగంగా సేకరించిన పత్రాలు, సమాచారం మొత్తాన్నీ.. ఈ అంశంపై పిటిషన్ వేసిన సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ తదితరులకు అందించాలని కూడా అప్పుడు ఆదేశించింది.
సిట్ ఏర్పాటుకు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసిన నేపథ్యంలో తాజాగా జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.కె.సిక్రిల నేతృత్వంలోని ధర్మాసనం మరో వారం రోజుల గడువు ఇచ్చింది. అలాగే.. నల్లధనానికి సంబంధించిన కొన్ని కీలక ఫైళ్లు శాస్త్రిభవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయని సీనియర్ న్యాయవాది రామ్‌జెఠ్మలానీ ఆరోపించటంతో.. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ రెవెన్యూ విభాగంలోని కార్యదర్శి స్థాయి అధికారి సంరక్షణలో ఉంచాలని కూడా ధర్మాసనం నిర్దేశించింది. అయితే.. జెఠ్మలానీ ఆరోపణలను సొలిసిటర్ జనరల్ మోహన్‌పరాశరన్ ఖండించారు. నల్లధనానికి సంబంధించిన పత్రాలన్నిటినీ నార్త్‌బ్లాక్‌లో ఉంచటం జరిగిందని, శాస్త్రిభవన్‌లో కాదని ఎస్‌జీ పేర్కొన్నారు.