సిట్ తొలి సమావేశంలో నిర్ణయం
న్యూఢిల్లీ: నల్లధనం కేసుల దర్యాప్తునకు కేంద్రం నియమించిన ప్రత్యేక విచారణ బృందం(సిట్) తొలి సమావేశం సోమవారం ఢిల్లీలో జరిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి. షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నల్లధనానికి సంబంధించిన కేసులను వేగంగా చేపట్టడంపై పరిశీలన జరపాలని నిర్ణయించారు. విదేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. రెండు గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి ఒక ప్రకటన జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చ జరిగిందని, రోడ్ మ్యాప్ ఖరారైందని వెల్లడించింది.
అయితే, ఆ రోడ్ మ్యాప్ (అనుసరించాల్సిన ప్రణాళిక) ఏమిటన్నది చెప్పలేదు. తదుపరి సమావేశం త్వరలోనే జరుగుతుందని ప్రకటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థలు చేపట్టిన నల్లధనం, మనీలాండరింగ్ కేసుల వివరాలు, ప్రగతి గురించి వివరాలు ఇవ్వాలని ఆదేశించినట్లు సమవేశంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో సిట్ వైస్ చైర్మన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరిజిత్‌పసాయత్, ఐబీ సహా 11 కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నల్లధనంపై దర్యాప్తు వేగవంతం
Published Tue, Jun 3 2014 1:17 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement
Advertisement