పన్ను ఎగవేతపై సిట్
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతను తీవ్రమైన నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్ ఎంబీ షా అన్నారు. విదేశాల్లో అక్రమ సంపదను దాచుకున్న భారతీయుల వివరాలను ఆయా దేశాలు వెల్లడించేలా ఒత్తిడి పెంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి రప్పించాలనే భారత్ లక్ష్యానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు దేశంలో సైతం అక్రమ సంపద పేరుకుపోవడాన్ని నిరోధిస్తుందని అన్నారు. పన్ను ఎగవేత భారత్‌లో ప్రస్తుతం సివిల్ నేరంగా ఉందని, విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలు ఫెమా (విదేశీ మారక నిర్వహణ చట్టం) కిందకి వస్తుండగా.. పన్ను ఎగవేతను ఆదాయ పన్ను చట్టం (1961) కింద ఎదుర్కోవడం జరుగుతోందని షా వివరించారు.
స్వభావరీత్యా రెండూ సివిల్ చట్టాలేనని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు అవకాశం ఉన్నవి కాదని సిట్ చైర్మన్ పీటీఐతో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పన్ను ఎగవేతను తీవ్రమైన క్రిమినల్ నేరంగా పరిగణించాలని తాము గట్టిగా ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. పన్ను సంబంధిత నేరాలు సివిల్ స్వభావాన్నే కలిగివున్న పక్షంలో విదేశీ ప్రభుత్వాలు సహకరించవని అన్నారు. తీవ్రమైన నేరంగా కనుక చేస్తే.. విదేశాలు నల్ల కుబేరుల పేర్లు వెల్లడించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. సుప్రీం మాజీ న్యాయమూర్తులు ఎంబీ షా, అరిజిత్ పసాయత్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్.. ఇటీవల నల్లధనంపై తాజా నివేదికను అందజేసింది.
తీవ్ర నేరంగా పరిగణించాలి
Published Mon, Dec 15 2014 1:33 AM | Last Updated on Thu, Sep 27 2018 4:22 PM
Advertisement
Advertisement