ఘజియాబాద్: నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశలో ఘజియాబాద్ అభివృద్ధి సంస్థ(జీడీఏ) ముందడుగువేసింది. ఈ మేరకు జీటీ రోడ్డుకు ఆనుకొని కొత్తగా నిర్మించిన అండర్‌పాస్ రోడ్డును బుధవారం ప్రారంభించారు. సుమారు రూ.6.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అండర్‌పాస్ రోడ్డుకు 2013 జూన్ 3వ తేదీన యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు. దీన్ని జీటీ రోడ్డు మీద మీరట్ రోడ్ టీ- పాయింట్ నుంచి హిందోన్ బ్రిడ్జి మధ్య నిర్మించారు. కాగా, ప్రజల సౌకర్యార్థం బుధవారం జీడీఏ వైస్ చైర్మన్ సంతోష్ యాదవ్ ప్రారంభించారు.
ఈ అండర్‌పాస్ వినియోగంలోకి వస్తే జీటీ రోడ్డుపైన ట్రాఫిక్ సమస్య పరిష్కారమైనట్టేనని అధికారులు అంటున్నారు. ఎన్‌హెచ్ 24, ఎన్‌హెచ్ 58 నుంచి ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలు జీటీ రోడ్డు వద్ద కలుస్తాయి.
అక్కడనుంచి అవి జీటీ రోడ్డు ఎడమ వైపు నుంచి ఘజియాబాద్‌వైపు వెళ్లి అక్కడ యూ టర్నర్ తీసుకుని ఢిల్లీ వైపు కదులుతాయి. దీంతో యూ-టర్న్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడేది. దీంతోపాటు ప్రమాదాల సంఖ్య విపరీతంగా జరిగేవి. దీంతో ఏడాది కిందట అండర్‌పాస్ నిర్మాణానికి నిర్ణయించారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య పరిష్కారమైనట్లే. జీడీఏకి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ రోడ్డునుంచి వచ్చే వాహనాలు అండర్ పాస్ ను ఉపయోగించుకుని సాయి ఉపవాన్ వైపు వెళ్లిపోవచ్చు..’ అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఈ అండర్‌పాస్‌ను తేలికపాటి వాహనాల రాకపోకల నిమిత్తం నిర్మించారు. దీనిద్వారా కేవలం కార్లు, జీపులు వంటి వాహనాలు మాత్రమే వెళ్లగలవు. ఈ అండర్ పాస్ 46 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తులో నిర్మించారు.
ట్రాఫిక్ సమస్యకు జీడీఏ చెక్..
Published Fri, Oct 24 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement