
'స్వామి వెనుక బీజేపీ, మోదీ ఉన్నారు'
కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఎలా కేసులు ఎలా పెడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దీని వెనక ఉన్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాటియాల కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఈరోజు అందరూ పేపర్లు చదివే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సుబ్రమణ్యం స్వామికి జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. స్వామి పార్లమెంటు సభ్యుడు కాదు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా లేరు. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, వాళ్లను ఏమీ అనలేదు, ఉగ్రవాదులను ఆయన చంపలేదు. కేవలం కాంగ్రెస్ నాయకత్వాన్ని కోర్టుకు లాగినందుకు బహుమతిగానే ఆయనకు జడ్ కేటగిరీ భద్రత, ప్రభుత్వ క్వార్టర్స్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోంది. ఇలా ఇంతకుముందెన్నడూ లేదు. గత ఏడాది కాలంగా గుజరాత్ ప్రతిపక్ష నేత గానీ, హిమాచల్ సీఎం గానీ, ఇప్పుడు పార్లమెంటు మొదలై వారం రోజులు కూడా గడవలేదు, అరుణాచల్ ప్రదేశ్‌లో గవర్నర్‌తో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. కోర్టు అడ్డుపడటంతో ఆగింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ దాడులు చేస్తున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే కుట్రలు చేస్తున్నారు. మొదట్లో తాము కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే వ్యతిరేకం అన్నారు. ఇప్పుడు మరే ఇతర పార్టీ అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో కూడా పోరాడింది' అని అజాద్ అన్నారు.
సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజాద్ ఇంటికి వెళ్లారు. సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో తదుపరి పర్యవసానాల గురించి చర్చించారు.