కోల్‌కతా బాలిక ప్రస్థానం
కోల్‌కతా: కోల్‌కతా మహానగరంలోని మురికివాడ గల్లీలో పుట్టి పెరిగింది ఆమె. క్రీడలపై ఉత్సాహమే ఆమెను జిల్లా స్థాయికి చేరుకునేలా చేసింది. కోల్‌కతాలోని రైల్వే పట్టాలకు చేరువలోని గుర్తింపులేని మురికివాడకు చెందిన ప్రియాంకా ప్రసాద్ (12) ఈ ఘనత సాధించేందుకు ఏటికి ఎదురీదింది. బామ్మ, తమ్ముడితో కలిసి మురికివాడలో నివాసం ఉంటున్న ఆమె వేకువ జామునే నిద్రలేచి, స్థానిక ఎన్జీవో నిర్వహిస్తున్న కోచింగ్ క్లాసులకు హాజరవుతుంది. అక్కడి నుంచి ఇంటికొచ్చాక వంటా వార్పు వంటి పనులన్నీ తనే చేస్తుంది. సాయంత్రం చేత్లా సెంట్రల్ పార్కులో బాస్కెట్‌బాల్ ప్రాక్టీసు కొనసాగిస్తుంది. ఇదీ ఆమె దినచర్య. ఎంఎస్ వెల్ఫేర్ సొసైటీ ఇచ్చిన ఆసరాతో ఆమె పశ్చిమబెంగాల్‌లోని 24 పరగణాల జిల్లా జట్టులో చోటు సంపాదించగలిగింది. రాష్ట్రస్థాయిలో 24 పరగణాల జిల్లా జట్టును చాంపియన్‌గా నిలిపింది. ఎంఎస్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన గురువులు లాహా, కరీమా ఇచ్చిన శిక్షణతోనే తాను ఈ ఘనత సాధించగలిగానని, వారి ఆసరాతో మరిన్ని విజయాలు సాధించాలనుకుంటున్నానని ప్రియాంక చెప్పింది.