ప్రతీకాత్మక చిత్రం
డెహ్రాడూన్ : చిరుత బారి నుంచి తమ్ముడి ప్రాణాలను కాపాడటం కోసం ఓ అక్క తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. తెలివితో ధైర్యంగా తన తమ్ముడిని రక్షించింది.. కానీ చిరుత దాడిలో తను తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అక్టోబర్ 4వ తేదీన ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని దేవకుండి తల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 11 ఏళ్ల రాఖీ, నాలుగేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకుంటుండగా.. వారిపై చిరుత దాడి చేసింది. అయితే చిరుత దాడి చేస్తుంటే రాఖీ అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే ఉండిపోయింది. తన చిన్నారి తమ్ముడిపై పడుకుని చిరుత అతనిపై దాడి చేయకుండా చేసింది. అలా తన తమ్ముడిని కాపాడింది. కానీ రాఖీ మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
చిరుత పిల్లలపై దాడి చేస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకోని శబ్ధాలు చేయడంతో.. చిరుత అడవిలోకి పారిపోయింది. వెంటనే గ్రామస్తులు రాఖీని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల దృష్ట్యా రాఖీకి మెరుగైన వైద్యం అందించాల్సి ఉందని అక్కడి వైద్యులు తెలుపడంతో.. బాలిక బంధువులు ఆమెను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ సిబ్బంది రాఖీని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో అతి కష్టం మీద రాఖీ బంధువులు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సత్‌పాల్ మహారాజ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రి చొరవతో రాఖీని 7వ తేదీన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాఖీ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు ఆమె బంధువులు తెలిపారు.
దీనిపై సత్‌పాల్ ఓఎస్‌స్డీ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. బాలిక వైద్యం కోసం మంత్రి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారని.. ఇతర అవసరమై ఖర్చులు కూడా భరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే ఢిల్లీలో ఉన్న బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. బాలిక చూపిన ధైర్యాన్ని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment