ప్రతీకాత్మక చిత్రం
లక్నో : 2013లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ను వరదలు ముంచెత్తిన సమయంలో తప్పిపోయిన అలీగఢ్ బాలిక.. దాదాపు ఐదేళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఈ నేపథ్యంలో మనమరాలిని ఇన్నేళ్లుగా క్షేమంగా కాపాడి, ప్రస్తుతం తమ దగ్గరికి చేర్చిన స్వచ్ఛంద సంస్థలకు ఆమె బామ్మాతాతయ్యలు ధన్యవాదాలు తెలిపారు. అసలేం జరిగిందంటే... ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన చంచల్ అనే మానసిక వికలాంగురాలు 2013లో తన తల్లిదండ్రులతో కలిసి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లింది. ఆ సమయంలో ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేదార్‌నాథ్‌లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో చంచల్ కుటుంబం చెల్లాచెదురైంది. ఆమె తండ్రి మరణించగా.. ఆమె తల్లి మాత్రం క్షేమంగా ఇంటికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో జమ్మూలోని ఓ అనాథాశ్రమ నిర్వాహకులు చంచల్‌ను(17) చేరదీసి.. ఐదేళ్లుగా ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. మానసిక వికలాంగురాలైన చంచల్ తన స్వస్థలం గురించిన పూర్తి వివరాలు వాళ్లకు చెప్పలేకపోయింది. అయితే ఎప్పుడైనా అలీగఢ్‌కు సంబంధించిన విషయాల గురించి చర్చించినపుడు మాత్రం ఆమెలో ఉత్సాహం కనిపించేది. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు.. ఆ దిశగా చంచల్ కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అలీగఢ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించి చంచల్ వివరాలు తెలియపరిచారు. చివరికి పోలీసుల సాయంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment