ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వండి: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ జలవనరుల మరమ్మతులు, ఆధునీకరణ, సంరక్షణ ప్రాజెక్టు(ఆర్‌ఆర్‌ఆర్) పథకం కింద తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌కాకతీయ పనులను స్వయంగా వీక్షించాలని కోరా రు. జాతీయహోదా ప్రకటన ప్రక్రియను వేగవంతం చేయడంపై, ఆర్‌ఆర్‌ఆర్ నిధుల కేటాయింపుపై మంత్రి సానుకూలంగా స్పందించారని కవిత మీడియాకు తెలిపారు.