Pranahitha-Chevella
-
కేసీఆర్ పాలనలో దళితులకు అవమానమే: భట్టి
సికింద్రాబాద్ : దళిత, బహుజనులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతను కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందించగలదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మరోసారి పునరుద్ఘాటించారు. శుక్రవారం కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఎస్సీ ప్లీనరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..60 ఏళ్లు పోరాడి సాధించుకున్నతెలంగాణ రాష్ట్రంలో దళితులు వంచనకు, మోసానికి, అవమానాలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చి తానే సీఎం కుర్చీ ఎక్కారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి అందిస్తానని ఎన్నికల్లో హామీనిచ్చి దానిని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు ఆత్మగౌరవం కోసమే వచ్చాయని గుర్తు చేశారు. దళితులు సాధికారత సాధించాలంటే రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేసే కేసీఆర్ పాలనలో దళితులు అవమానాల పాలవుతున్నారని నిప్పులు చెరిగారు. మాట తప్పిన కేసీఆర్ దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి అమానవీయంగా బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కాంగెస్ పార్టీ 2019 లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సర్వరోగ నివారిణి అని అన్నారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికి 50 నుంచి 60 వేల కోట్లు రూపాయల నిధులు కేటాయింపులు జరపాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కి కేవలం ఐదారు వేల కోట్ల రూపాయల నిధుల్ని మాత్రమే కేటాయిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ని టీఆర్ఎస్ అవమానించింది.. టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని విమర్శించారు. కాంట్రాక్టర్లలో ఒక్క దళితుడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అవినీతి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ పేరిట కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చారని మండిపడ్డారు. రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 88 వేల కోట్ల రూపాయలకు పెంచిందని పేర్కొన్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే సామర్థ్యమున్నప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే అక్కసుతో పేరు మార్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భట్టివిక్రమార్కతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. -
ప్రాణహిత చేవెళ్ల పనులు జరుగుతున్నాయిలా!
-
'జాతీయ ప్రాజెక్టుగా పోలవరం.. ఏడేళ్లలో పూర్తి'
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తున్నామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు 7 సంవత్సరాల్లో పూర్తవుతుందని ఆమె చెప్పారు. గురువారం ఉమాభారతి మీడియాతో మాట్లాడారు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి సరిపడా నిధులు ఇస్తామని హామీఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రాణహిత- చేవెళ్ల, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించే అంశంపై పరిశీలిస్తున్నామని ఉమాభారతి అన్నారు. -
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా ఇవ్వండి: కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు త్వరగా జాతీయ హోదా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు, కేసులు ఉన్నప్పటికీ జాతీయ హోదా దక్కిందని, అయితే ప్రాణహిత విషయంలో ఇంకా జాప్యం జరుగుతోందన్నారు. జాతీయ జలవనరుల మరమ్మతులు, ఆధునీకరణ, సంరక్షణ ప్రాజెక్టు(ఆర్ఆర్ఆర్) పథకం కింద తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్‌కాకతీయ పనులను స్వయంగా వీక్షించాలని కోరా రు. జాతీయహోదా ప్రకటన ప్రక్రియను వేగవంతం చేయడంపై, ఆర్ఆర్ఆర్ నిధుల కేటాయింపుపై మంత్రి సానుకూలంగా స్పందించారని కవిత మీడియాకు తెలిపారు. -
5న ‘పాలమూరు’కు శంకుస్థాపన!
నక్కలగండి ప్రాజెక్టుకు కూడా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రాజెక్టులపై మూడున్నర గంటల పాటు అధికారులతో సమీక్ష కృష్ణా, గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు ప్రాణహిత పేరును కాళేశ్వరంగా మారిస్తే బాగుంటుందని ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు వచ్చేనెల మొదటివారంలో శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశే ఖర్‌రావు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు గతంలోనే అనుమతులు ఉన్నందున కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తికావాలని... ఏకకాలంలో టన్నెల్, రిజర్వాయర్, పంప్‌హౌజ్ పనులన్నీ జరగాలని ఆయన అధికారులకు సూచించారు. ఏప్రిల్ 5 వతేదీన శంకుస్థాపన చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి జోషి, ఈఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం నాయకుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నిజానికి కొత్తది కాదని, గతంలోనే నీటి కేటాయింపులు, అనుమతులు కలిగిన భీమా ప్రాజెక్టేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 4.25 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరిచ్చేందుకు 100 టీఎంసీల సామర్థ్యం కలిగిన భీమా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ లైబ్రరీలో ఆధారాలున్నాయని సీఎం చెప్పారు. భీమా ప్రాజెక్టునే పాలమూరు ఎత్తిపోతల పథకంగా అమలుచేస్తూ, సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంచి నీరివ్వాలని పేర్కొన్నారు. వేగంగా పూర్తి చేసేలా.. కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించుకొని.. కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న కేటాయింపులకు తోడు మరో 120 టీఎంసీల వరకు అదనంగా రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉన్నందున.. ఆ నీటిని కూడా వినియోగించుకోగలిగేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని చెప్పారు. దక్షిణ తెలంగాణలో పాలమూరు, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, పెండ్డిపాకల, నక్కలగండి, ఉత్తర తెలంగాణలో ప్రాణ హిత, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తిచేయాలని... ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చేయాలని, దేవాదులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రాణహిత పేరు మార్పు..! సమీక్షలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తికావొద్దని, నిధులు ఖర్చు కావద్దనే ఉద్దేశంతో సమైక్య పాలనలో ప్రాజెక్టుల డిజైన్లను తయారు చేశారని ఆయన ఆరోపించారు. దీనికి ప్రాణహిత ప్రాజెక్టే ఉదాహరణ అని.. ప్రాజెక్టును పూర్తిగా వివాదాల్లోకి నెట్టి తెలంగాణ రైతులు లబ్ధి పొందకుండా చేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో లంకెపెట్టి, అటవీ శాఖతో కొర్రీలు పెట్టించారన్నారు. మహారాష్ట్రతో వివాదం లేకుండా ప్రాణహిత, గోదావరిలను కలుపుతూ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని విధాలా మేలని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత పేరుకు బదులు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరు పెడితే సమంజసంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రాణహితతో పాటు మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ రీ ఇంజనీరింగ్ జరగాలన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఇంజనీర్లను వచ్చేవారం హెలిక్యాప్టర్‌లో సర్వేకు పంపుతామన్నారు. పాత డిజైన్లకే మొగ్గు.. నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకానికి తొలి డీపీఆర్‌నే అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఓపెన్ చానల్, టన్నెల్ల ద్వారా నక్కలగండి నుంచి మిడ్ డిండికి, అక్కడినుం చి ఎగువ డిండికి నీటిని తరలిస్తేనే మేలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌ను కొత్తగా చేపట్టనున్న జూరాల-పాకాల ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చన్న అధికారుల సూచనకు సీఎం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు త్వరలోనే పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇక పాలమూరు ఎత్తిపోతల డిజైన్లోనూ మార్పు చేయాలని సీఎం గతంలో నిర్ణయించినా... అది సాధ్యమయ్యే అవకాశం లేనట్లు సమాచారం. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవడం కాకుండా, కర్ణాటకలోని ఆల్మట్టి లేదా నారాయణపూర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకోవచ్చని సీఎం భావించారు. దీనిపై సర్వే సైతం చేయించారు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది కావడం, భూసేకరణ సమస్యలు తలెత్తే అవకాశాల దృష్ట్యా ఆ యోచనను పక్కనపెట్టినట్లు తెలిసింది. కాగా ఈ రెండు ప్రాజెక్టులకు వచ్చే నెల 5వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. -
సాగునీటికి ‘మహా’బాట!
మహారాష్ట్ర సర్కారుతో నేడు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఒప్పందాలపై సమీక్ష ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 95 మీటర్లకు పరిమితం చేసేందుకు ఓకే ప్రాణహిత-చేవెళ్ల, పెన్‌గంగ, లెండిలపైనా కీలక చర్చలు ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారం కోసం విజ్ఞప్తి చేసే అవకాశం ముంబై బయలుదేరి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, పెన్‌గంగ తదితర అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న వివాదాలను సానుకూల ధోరణితో పరిష్కరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు నాలుగు దశాబ్దాల కింద కుదిరిన ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కనీస నీటిమట్టాల ఎత్తును తగ్గించుకునేందుకు అంగీకరిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు చర్చలు జరుపనున్నారు. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు, అధికారులు సోమవారం ముంబైకి బయలుదేరి వెళ్లారు. కనీస మట్టం తగ్గింపునకు ఓకే.. గోదావరిలో లభ్యతగా ఉన్న 85 టీఎంసీల నీటిని వినియోగించుకుని సుమారు 3.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 975 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల్లో కొంత భూభాగం ముంపునకు గురవుతున్న దృష్ట్యా... దీనిని అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించుకుని, 1978 ఆగస్టు 7న కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. తర్వాతి కాలంలో ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన జాతీయ జల వనరుల సంస్థ (సీడబ్ల్యూసీ), జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఇచ్చంపల్లి రిజర్వాయర్ కనీస నీటి మట్టాల (ఎఫ్ఆర్ఎల్)ను 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకోవాలని సూచిం చాయి. ఇలా తగ్గించడం ద్వారా ముంపునకు గురయ్యే భూమి 94,620 హెక్టార్ల నుంచి 12,522 హెక్టార్లకు తగ్గుతుందని... ముంపు గ్రామాల సంఖ్య కూడా 297 నుంచి ఏడు గ్రామాలకు తగ్గుతుందని పేర్కొన్నాయి. దీనిపై తాజాగా సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్రం... 112 మీటర్ల ఎత్తులో ఫౌండేషన్ చేస్తూనే, కనీస నీటి మట్టాన్ని మాత్రం 95 మీటర్లకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. కానీ దీనిపై ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో... పాత ఒప్పందాలు నిరుపయోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై తిరిగి కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలమైతే తదుపరి ఛత్తీస్‌గఢ్‌తో చర్చించనున్నారు. ఇదే భేటీలో ప్రాణహిత-చేవెళ్ల, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల ఒప్పందాలపై మంత్రి హరీశ్‌రావు గత ఏడాది జూలై 23న.. అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చవాన్ సర్కారుతో చర్చలు జరిపి, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామం లో నిర్మించదలిచిన 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ, ముంపు ప్రాంతాలపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో అధ్యయనం చేయించాలని నిర్ణయిం చారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ తెలంగాణ వాదనను సమర్థిస్తూ... 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణానికి పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ నివేదికను ప్రామాణికంగా తీసుకుని బ్యారేజీ ఎత్తుకు సమ్మతించాలని మహారాష్ట్రను కోరనున్నారు. ఇక తెలంగాణకు 2.43 టీఎంసీల నీటితో 22 వేల ఎకరాలకు నీటిని అందించే లెండి ప్రాజెక్టు కాలువల నిర్మాణం, 5.12 టీఎం సీల నీటిని వినియోగించుకునే అవకాశమున్న దిగువ పెన్‌గంగ కింది కాలువల నిర్మాణం, భూసేకరణకు మహారాష్ట్ర ముందుకు రావాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర సహకారం కోరతాం: హరీశ్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో కీలక చర్చలు జరుపుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముంబై బయలుదేరే ముం దు ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అడ్డంకులను తొలగించే దిశగా భేటీ ఉంటుందని హరీశ్ స్పష్టం చేశారు. లెండి, పెన్‌గంగ పూర్తయితే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందన్నారు. -
భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం
పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్‌ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
ఈ ఏడాదికి ‘ఏడు’ ప్రాజెక్టులు!
వందకోట్లు వెచ్చిస్తే చాలు.. సాగులోకి లక్ష ఎకరాలు తెలంగాణ సర్కార్ తక్షణ {పాధాన్యమిదే హైదరాబాద్: ఏడాది కాలంలో ఏడు ప్రాజెక్టులను పూర్తిచేసేలా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఒక భారీ, ఆరు మధ్యతరహా ప్రాజెక్టులను ఏడాదిలో పూర్తిచేసి సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వీటికి మరో వందకోట్ల నిధులు వెచ్చిస్తే చాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతున్నట్లు తక్షణ ఆయకట్టు అభివృద్ధిలోకి వచ్చే ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యమిచ్చేలా నివేదికలు తయారుచేసింది. దీని ప్రకారం కోయిల్‌సాగర్ ప్రాజెక్టుతో పాటు గొల్లవాగు, నీల్వాయి, పెద్దవాగు-జగన్నాథ్‌పూర్, రాళ్లవాగు, మత్తడివాగు, చౌట్పల్లి హన్మంతురెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం చివరిదశలో ఉంది. నిజానికి ఇందులో చాలా ప్రాజెక్టులు 2010-11, 2011-12 నాటికే పూర్తి చేయాలని గత ప్రభుత్వాలు నిర్దేశించుకున్నప్పటికీ భూసేకరణ సమస్య, కాంట్రాక్టర్ల ఆలస్యం, నిధుల విడుదలలో జాప్యం తదితర కారణాలతో పనులు పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2014-15లో పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం రూ.915 కోట్లు అవసరమని తేల్చిన ప్రభుత్వం ఇప్పటికే రూ.820 కోట్ల మేర ఖర్చు చేసింది. మరో రూ.100 కోట్లు వెచ్చిస్తే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. మరో 16 ప్రాజెక్టులు రెండో దశలో.. పనులు పాక్షికంగా పూర్తిచేసుకున్న మరో 16 ప్రాజెక్టులను రెండోదశలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఉదయ సముద్రం, ఎస్సారెస్సీ స్టేజ్-2, కిన్నెరసాని, దేవాదుల, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ప్రస్తుత బడ్జెట్లో రూ.2 వేల కోట్ల మేర కేటాయింపులు జరుపవచ్చని అంచనా వేస్తున్నా, 2015-16 నాటికి ఈ ప్రాజెక్టుల పనులను పూర్తి చేసి వీటిద్వారా మరో 2 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరందించాలని చూస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లోనే నాగార్జునసాగర్, నిజాంసాగర్ల ఆధునికీకరణ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వరద కట్టల అభివృద్ధికి నిధులను సమకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక భారీ ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, కాంతానపల్లి ప్రాజెక్టుల ప్రాధాన్యతను ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టిన విషయం తెలిసిందే.