5న ‘పాలమూరు’కు శంకుస్థాపన!
- నక్కలగండి ప్రాజెక్టుకు కూడా.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
- ప్రాజెక్టులపై మూడున్నర గంటల పాటు అధికారులతో సమీక్ష
- కృష్ణా, గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు
- ప్రాణహిత పేరును కాళేశ్వరంగా మారిస్తే బాగుంటుందని ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు వచ్చేనెల మొదటివారంలో శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశే ఖర్‌రావు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు గతంలోనే అనుమతులు ఉన్నందున కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రెండు ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తికావాలని... ఏకకాలంలో టన్నెల్, రిజర్వాయర్, పంప్‌హౌజ్ పనులన్నీ జరగాలని ఆయన అధికారులకు సూచించారు.
ఏప్రిల్ 5 వతేదీన శంకుస్థాపన చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. శుక్రవారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల అంశంపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి జోషి, ఈఎన్‌సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం నాయకుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం నిజానికి కొత్తది కాదని, గతంలోనే నీటి కేటాయింపులు, అనుమతులు కలిగిన భీమా ప్రాజెక్టేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే గుల్బర్గా, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన 4.25 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరిచ్చేందుకు 100 టీఎంసీల సామర్థ్యం కలిగిన భీమా ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందన్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ లైబ్రరీలో ఆధారాలున్నాయని సీఎం చెప్పారు. భీమా ప్రాజెక్టునే పాలమూరు ఎత్తిపోతల పథకంగా అమలుచేస్తూ, సాగునీరు అందించడంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంచి నీరివ్వాలని పేర్కొన్నారు.
వేగంగా పూర్తి చేసేలా..
కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించుకొని.. కార్యరంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతమున్న కేటాయింపులకు తోడు మరో 120 టీఎంసీల వరకు అదనంగా రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉన్నందున.. ఆ నీటిని కూడా వినియోగించుకోగలిగేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని చెప్పారు. దక్షిణ తెలంగాణలో పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు, పెండ్డిపాకల, నక్కలగండి, ఉత్తర తెలంగాణలో ప్రాణ హిత, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తిచేయాలని... ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం ప్రాజెక్టులో మార్పులు చేయాలని, దేవాదులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
ప్రాణహిత పేరు మార్పు..!
సమీక్షలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తికావొద్దని, నిధులు ఖర్చు కావద్దనే ఉద్దేశంతో సమైక్య పాలనలో ప్రాజెక్టుల డిజైన్లను తయారు చేశారని ఆయన ఆరోపించారు. దీనికి ప్రాణహిత ప్రాజెక్టే ఉదాహరణ అని.. ప్రాజెక్టును పూర్తిగా వివాదాల్లోకి నెట్టి తెలంగాణ రైతులు లబ్ధి పొందకుండా చేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో లంకెపెట్టి, అటవీ శాఖతో కొర్రీలు పెట్టించారన్నారు.
మహారాష్ట్రతో వివాదం లేకుండా ప్రాణహిత, గోదావరిలను కలుపుతూ కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని విధాలా మేలని అభిప్రాయపడ్డారు. ప్రాణహిత పేరుకు బదులు ప్రాజెక్టుకు కాళేశ్వరం పేరు పెడితే సమంజసంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రాణహితతో పాటు మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ రీ ఇంజనీరింగ్ జరగాలన్నారు. కృష్ణా, గోదావరి నదులపై ప్రతిపాదించిన ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఇంజనీర్లను వచ్చేవారం హెలిక్యాప్టర్‌లో సర్వేకు పంపుతామన్నారు.
పాత డిజైన్లకే మొగ్గు..
నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు ఉద్దేశించిన నక్కలగండి ఎత్తిపోతల పథకానికి తొలి డీపీఆర్‌నే అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. ఓపెన్ చానల్, టన్నెల్‌ల ద్వారా నక్కలగండి నుంచి మిడ్ డిండికి, అక్కడినుం చి ఎగువ డిండికి నీటిని తరలిస్తేనే మేలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మిడ్ డిండి రిజర్వాయర్‌ను కొత్తగా చేపట్టనున్న జూరాల-పాకాల ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చన్న అధికారుల సూచనకు సీఎం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టుకు త్వరలోనే పరిపాలనా అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇక పాలమూరు ఎత్తిపోతల డిజైన్‌లోనూ మార్పు చేయాలని సీఎం గతంలో నిర్ణయించినా... అది సాధ్యమయ్యే అవకాశం లేనట్లు సమాచారం. జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకోవడం కాకుండా, కర్ణాటకలోని ఆల్మట్టి లేదా నారాయణపూర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకోవచ్చని సీఎం భావించారు. దీనిపై సర్వే సైతం చేయించారు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్నది కావడం, భూసేకరణ సమస్యలు తలెత్తే అవకాశాల దృష్ట్యా ఆ యోచనను పక్కనపెట్టినట్లు తెలిసింది. కాగా ఈ రెండు ప్రాజెక్టులకు వచ్చే నెల 5వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.