సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘‘టీఆర్‌ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తెలంగాణ రజాకార్ల సమితి. రాష్ట్రంలో అవినీతి సర్కారు రాజ్యమేలుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారింది. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నారు. ఇది కేసీఆర్ అవినీతికి మచ్చుతునక’’ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ప్రధాని మోదీ ఆశీస్సులు తెలంగాణ ప్రజల పై ఎప్పుడూ ఉంటాయని.. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర 22వ రోజు గురువా రం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక ఎంవీఎస్ కళాశాలలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఇందులో నడ్డాతోపాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. కరోనా సమయంలో అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయాయని.. అదే భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రజల సహకారంతో కరోనాను ఎదుర్కొన్నదని చెప్పారు. బూస్టర్ డోసు సహా 130 కోట్ల మందికి 190 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చి ప్రజలను కాపాడుకున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా 48 దేశాలకు 1.74 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేశామని వివరించారు. కరోనా సమయంలో నిబంధనలు పాటించని సీఎం కేసీఆర్.. అదే సమయంలో అదే నిబంధనల పేరిట బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో కేంద్రం దేశవ్యాప్తంగా 80కోట్ల మందికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు, పప్పు ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలో 12 శాతం మందిని దారిద్య్రరేఖ నుంచి విముక్తి చేసిందన్నారు. క్వింటాల్ పత్తికి మద్దతు ధరను రూ.10 వేలకు పెంచామన్నారు.
ప్రజలను మోసం చేస్తున్నారు..
రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని జేపీ నడ్డా ఆరోపించారు. కేసీఆర్ కేంద్ర పథకాలను తన పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నాడని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ కేంద్ర పథకంతో రాష్ట్రంలో 26 లక్షల మందికి లబ్ధి చేకూరేదని.. కానీ కేసీఆర్ దాన్ని అమలు చేయలేకపోయారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్లుగా పేరు మార్చి అమలు చేస్తున్నారని.. అది కూడా ఇళ్లు సరిగా ఇవ్వకుండా ఇక్కడి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇక ఎన్సీడీసీ కింద తెలంగాణలో గొర్రెలు, మేకల అభివృద్ధికి నాలుగు వేల కోట్లు ఇచ్చామన్నారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర, బహిరంగ సభకు పెద్ద మొత్తంలో ప్రజలు ఆశీర్వదించడానికి రావడం సంతోషంగా ఉందని.. ఇది చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు.
బీజేపీకి అవకాశమివ్వండి: బండి సంజయ్
‘‘సీఎం కేసీఆర్ ఓసారి వరి కొనుగోలు చేయబోమని, మళ్లీ కొంటామని చెబుతాడు. కేసీఆర్ నిర్వాకంతో పంట వేయక.. వేసినా అకాల వర్షాల కారణంగా ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోయారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ 20 శాతం కూడా పూర్తి చేయలేదని.. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంతో పాలమూరు రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పాలమూరు ప్రజలపై కేసీఆర్ పగబట్టారు. ఇలాంటి కేసీఆర్‌ను ఎందుకు భరిస్తున్నారు? ఎనిమిదేళ్లుగా ఆర్డీఎస్ ఆధునీకరణ హామీ ఏమైంది? కుర్చీ వేసుకుని నీళ్లు మళ్లిస్తానని చెప్పిన మాటలు ఎక్కడ పోయాయి? కేసీఆర్ మాకు సహకరిస్తే ఆరు నెలల్లో ఈ సమస్య పరిష్కరించి అలంపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం. 69 జీఓను అమలు చేసి నారాయణపేట, కొడంగల్, మక్తల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇందుకు బీజేపీ అనుకూలంగా ఉంది..’’ అని సంజయ్ పేర్కొన్నారు.
రాహుల్ వచ్చి ఏం చేస్తారు?
రాహుల్‌గాంధీ ఏం చేయడానికి తెలంగాణకు వస్తున్నారని.. తెలంగాణపై జాప్యం చేసి 1,400 మందిని బలి తీసుకున్న కాంగ్రెస్‌కు ఇక్కడ చోటు లేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ సర్కారు గ్రూప్–1 నోటిఫికేషన్‌లో ఉర్దూని చేర్చి, ఎంఐఎం వాళ్లకు గ్రూప్–1 ఉద్యోగాలను తాకట్టు పెట్టిందని సంజయ్ మండిపడ్డారు. దీనిపై తాము అధికారంలోకి రాగానే.. ఉర్దూ ద్వారా గ్రూప్–1లో ఉద్యోగాలు పొందినవారిని తొలగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రిపై మండిపడ్డారు. ‘‘పాలమూరు మంత్రి.. నీ చరిత్ర తెలుసు.. నేను నోరు తెరిస్తే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించాలి. పేదల ఇళ్లు ఎవరి పేరున ఉన్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది. రాత్రికి రాత్రే నీ పేరుమీదకు మార్చుకుంటున్నావ్. బీజేపీ కార్యకర్తలు, అమాయక ప్రజలను అధికారులు బెదిరిస్తూ, అక్రమ కేసులు పెట్టిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. మట్టి, ఇసుక దందా చేసి అక్రమంగా సంపాదించిన నీ ఆస్తులను బీజేపీ ప్రభుత్వం రాగానే స్వాధీనం చేసుకొని పేదలకు ఇచ్చేస్తాం..’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు అవకాశమిచ్చారని.. ఈ సారి బీజేపీకి అవకాశమిస్తే, నీతి, నిజాయలతో కూడిన పాలన అందిస్తామని ప్రకటించారు.
బీజేపీ భయంతో ముందస్తుకు..: కిషన్‌రెడ్డి
తెలంగాణలో చిత్రమైన పరిస్థితి ఉందని.. ఐదేళ్లు పాలించేందుకు అవకాశమిస్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను అవమానపర్చాడని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘బీజేపీ భయంతోనే అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు 2023లో ఎన్నికలు జరిగితే ఓడిపోతాననే భయం కేసీఆర్‌కు పట్టుకుంది. ముందే ఎన్నికలు జరిగేలా చేసి కుమారుడిని సీఎంను చేయాలని ఆలోచన చేస్తున్నారు’’పేర్కొన్నారు. కేంద్రాన్ని బద్నాం చేయడమే కేసీఆర్ లక్ష్యమని.. వరి విషయంలో ఢిల్లీ వచ్చి డ్రామాలు చేసి, గంటలో ధర్నా ముగించారని విమర్శించారు. కేసీఆర్ ఫ్రంట్‌లు, టెంట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్, సీనియర్ నేత జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈటల.. సీఎం.. అంటూ నినాదాలు
– మహబూబ్‌నగర్‌లో బీజేపీ సభ జరిగిన ఎంవీఎస్ కళాశాల 42 ఎకరాల్లో విస్తరించి ఉంది. భవనాలు, పార్కింగ్, స్టేజీ పోగా సుమారు 30 ఎకరాల్లో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 80వేల మందికిపైగా జనం వచ్చినట్లు అంచనా.
– సభ ఆలస్యమైనందున తరుణ్ చుగ్ మాట్లాడలేదు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం మాట్లాడే అవకాశం రాలేదు. సభ ముగిశాక నడ్డా వాహనం ఎక్కి బయలుదేరుతుండగా.. ఈటల రాజేందర్ వెనకాల వచ్చారు. ఈ సందర్భంగా ఈటల అభిమానులు, కార్యకర్తలు.. ఈటల.. సీఎం సీఎం.. అంటూ నినాదాలు చేశారు.
టీఆర్‌ఎస్ కాదు.. తెలంగాణ రజాకార్ల సమితి: జేపీ నడ్డా
Published Thu, May 5 2022 9:44 PM | Last Updated on Fri, May 6 2022 7:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment