సికింద్రాబాద్ : దళిత, బహుజనులకు ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతను కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందించగలదని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మరోసారి పునరుద్ఘాటించారు. శుక్రవారం కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ ఎస్సీ ప్లీనరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..60 ఏళ్లు పోరాడి సాధించుకున్నతెలంగాణ రాష్ట్రంలో దళితులు వంచనకు, మోసానికి, అవమానాలకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే మాట మార్చి తానే సీఎం కుర్చీ ఎక్కారని మండిపడ్డారు.
దళితులకు మూడెకరాల భూమి అందిస్తానని ఎన్నికల్లో హామీనిచ్చి దానిని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు ఆత్మగౌరవం కోసమే వచ్చాయని గుర్తు చేశారు. దళితులు సాధికారత సాధించాలంటే రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మాయ మాటలతో ప్రజల్ని మోసం చేసే కేసీఆర్ పాలనలో దళితులు అవమానాల పాలవుతున్నారని నిప్పులు చెరిగారు. మాట తప్పిన కేసీఆర్ దళితుడిని ఉప ముఖ్యమంత్రిని చేసి అమానవీయంగా బర్తరఫ్ చేశారని ఆరోపించారు. కాంగెస్ పార్టీ 2019 లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సర్వరోగ నివారిణి అని అన్నారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలోని దళితుల అభివృద్ధికి 50 నుంచి 60 వేల కోట్లు రూపాయల నిధులు కేటాయింపులు జరపాలి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కి కేవలం ఐదారు వేల కోట్ల రూపాయల నిధుల్ని మాత్రమే కేటాయిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అంబేడ్కర్‌ని టీఆర్‌ఎస్ అవమానించింది..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని విమర్శించారు. కాంట్రాక్టర్లలో ఒక్క దళితుడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల్లో రెండున్నర లక్షల కోట్ల రూపాయల అవినీతి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేడ్కర్ పేరిట కాంగ్రెస్ చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చారని మండిపడ్డారు. రీ-డిజైన్ పేరుతో ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 88 వేల కోట్ల రూపాయలకు పెంచిందని పేర్కొన్నారు.
తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే సామర్థ్యమున్నప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో అంబేడ్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనే అక్కసుతో పేరు మార్చారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో భట్టివిక్రమార్కతో పాటు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, మాజీ మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment