సాగునీటికి ‘మహా’బాట! | Irrigated 'mahabata! | Sakshi
Sakshi News home page

సాగునీటికి ‘మహా’బాట!

Published Tue, Feb 17 2015 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

సాగునీటికి ‘మహా’బాట!

సాగునీటికి ‘మహా’బాట!

  • మహారాష్ట్ర సర్కారుతో నేడు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు
  • ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్
  • ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఒప్పందాలపై సమీక్ష
  • ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 95 మీటర్లకు పరిమితం చేసేందుకు ఓకే
  • ప్రాణహిత-చేవెళ్ల, పెన్‌గంగ, లెండిలపైనా కీలక చర్చలు
  • ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారం కోసం విజ్ఞప్తి చేసే అవకాశం
  • ముంబై బయలుదేరి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, అధికారులు
  • సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, పెన్‌గంగ తదితర అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న వివాదాలను సానుకూల ధోరణితో పరిష్కరించుకొనేందుకు చర్యలు చేపట్టింది.

    ముఖ్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు నాలుగు దశాబ్దాల కింద కుదిరిన ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కనీస నీటిమట్టాల ఎత్తును తగ్గించుకునేందుకు అంగీకరిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు చర్చలు జరుపనున్నారు. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు, అధికారులు సోమవారం ముంబైకి బయలుదేరి వెళ్లారు.
     
    కనీస మట్టం తగ్గింపునకు ఓకే..

    గోదావరిలో లభ్యతగా ఉన్న 85 టీఎంసీల నీటిని వినియోగించుకుని సుమారు 3.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 975 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల్లో కొంత భూభాగం ముంపునకు గురవుతున్న దృష్ట్యా... దీనిని అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించుకుని, 1978 ఆగస్టు 7న కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. తర్వాతి కాలంలో ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన జాతీయ జల వనరుల సంస్థ (సీడబ్ల్యూసీ), జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఇచ్చంపల్లి రిజర్వాయర్ కనీస నీటి మట్టాల (ఎఫ్‌ఆర్‌ఎల్)ను 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకోవాలని సూచిం చాయి.

    ఇలా తగ్గించడం ద్వారా ముంపునకు గురయ్యే భూమి 94,620 హెక్టార్ల నుంచి 12,522 హెక్టార్లకు తగ్గుతుందని... ముంపు గ్రామాల సంఖ్య కూడా 297 నుంచి ఏడు గ్రామాలకు తగ్గుతుందని పేర్కొన్నాయి. దీనిపై తాజాగా సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్రం... 112 మీటర్ల ఎత్తులో ఫౌండేషన్ చేస్తూనే, కనీస నీటి మట్టాన్ని మాత్రం 95 మీటర్లకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. కానీ దీనిపై ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో... పాత ఒప్పందాలు నిరుపయోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై తిరిగి కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నారు.

    ఈ చర్చలు సఫలమైతే తదుపరి ఛత్తీస్‌గఢ్‌తో చర్చించనున్నారు. ఇదే భేటీలో ప్రాణహిత-చేవెళ్ల, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల ఒప్పందాలపై మంత్రి హరీశ్‌రావు గత ఏడాది జూలై 23న.. అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చవాన్ సర్కారుతో చర్చలు జరిపి, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామం లో నిర్మించదలిచిన 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ, ముంపు ప్రాంతాలపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)తో అధ్యయనం చేయించాలని నిర్ణయిం చారు.

    సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తెలంగాణ వాదనను సమర్థిస్తూ... 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణానికి పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ నివేదికను ప్రామాణికంగా తీసుకుని బ్యారేజీ ఎత్తుకు సమ్మతించాలని మహారాష్ట్రను   కోరనున్నారు. ఇక తెలంగాణకు 2.43 టీఎంసీల నీటితో 22 వేల ఎకరాలకు నీటిని అందించే లెండి ప్రాజెక్టు కాలువల నిర్మాణం, 5.12 టీఎం సీల నీటిని వినియోగించుకునే అవకాశమున్న దిగువ పెన్‌గంగ కింది కాలువల నిర్మాణం, భూసేకరణకు మహారాష్ట్ర ముందుకు రావాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు వెల్లడించాయి.
     
    మహారాష్ట్ర సహకారం కోరతాం: హరీశ్

    అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో కీలక చర్చలు జరుపుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముంబై బయలుదేరే ముం దు ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అడ్డంకులను తొలగించే దిశగా భేటీ ఉంటుందని హరీశ్ స్పష్టం చేశారు. లెండి, పెన్‌గంగ పూర్తయితే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement