Phadnavis
-
సాగునీటికి ‘మహా’బాట!
మహారాష్ట్ర సర్కారుతో నేడు రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్ ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఒప్పందాలపై సమీక్ష ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని 95 మీటర్లకు పరిమితం చేసేందుకు ఓకే ప్రాణహిత-చేవెళ్ల, పెన్‌గంగ, లెండిలపైనా కీలక చర్చలు ప్రాజెక్టుల నిర్మాణానికి సహకారం కోసం విజ్ఞప్తి చేసే అవకాశం ముంబై బయలుదేరి వెళ్లిన మంత్రి హరీశ్‌రావు, అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, పెన్‌గంగ తదితర అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్రతో నెలకొన్న వివాదాలను సానుకూల ధోరణితో పరిష్కరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు నాలుగు దశాబ్దాల కింద కుదిరిన ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కనీస నీటిమట్టాల ఎత్తును తగ్గించుకునేందుకు అంగీకరిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు చర్చలు జరుపనున్నారు. ఇందుకోసం మంత్రి హరీశ్‌రావు, అధికారులు సోమవారం ముంబైకి బయలుదేరి వెళ్లారు. కనీస మట్టం తగ్గింపునకు ఓకే.. గోదావరిలో లభ్యతగా ఉన్న 85 టీఎంసీల నీటిని వినియోగించుకుని సుమారు 3.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 975 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్ (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్) రాష్ట్రాల్లో కొంత భూభాగం ముంపునకు గురవుతున్న దృష్ట్యా... దీనిని అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టాలని మూడు రాష్ట్రాలు నిర్ణయించుకుని, 1978 ఆగస్టు 7న కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. తర్వాతి కాలంలో ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన జాతీయ జల వనరుల సంస్థ (సీడబ్ల్యూసీ), జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఇచ్చంపల్లి రిజర్వాయర్ కనీస నీటి మట్టాల (ఎఫ్ఆర్ఎల్)ను 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకోవాలని సూచిం చాయి. ఇలా తగ్గించడం ద్వారా ముంపునకు గురయ్యే భూమి 94,620 హెక్టార్ల నుంచి 12,522 హెక్టార్లకు తగ్గుతుందని... ముంపు గ్రామాల సంఖ్య కూడా 297 నుంచి ఏడు గ్రామాలకు తగ్గుతుందని పేర్కొన్నాయి. దీనిపై తాజాగా సానుకూలంగా స్పందించిన తెలంగాణ రాష్ట్రం... 112 మీటర్ల ఎత్తులో ఫౌండేషన్ చేస్తూనే, కనీస నీటి మట్టాన్ని మాత్రం 95 మీటర్లకే పరిమితం చేసేందుకు సిద్ధమైంది. కానీ దీనిపై ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో... పాత ఒప్పందాలు నిరుపయోగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై తిరిగి కొత్తగా ఒప్పందాలను కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తొలుత మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు సఫలమైతే తదుపరి ఛత్తీస్‌గఢ్‌తో చర్చించనున్నారు. ఇదే భేటీలో ప్రాణహిత-చేవెళ్ల, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల ఒప్పందాలపై మంత్రి హరీశ్‌రావు గత ఏడాది జూలై 23న.. అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్‌చవాన్ సర్కారుతో చర్చలు జరిపి, పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామం లో నిర్మించదలిచిన 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ, ముంపు ప్రాంతాలపై కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్)తో అధ్యయనం చేయించాలని నిర్ణయిం చారు. సీడబ్ల్యూపీఆర్ఎస్ తెలంగాణ వాదనను సమర్థిస్తూ... 152 మీటర్ల ఎత్తు బ్యారేజీ నిర్మాణానికి పూర్తి మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ నివేదికను ప్రామాణికంగా తీసుకుని బ్యారేజీ ఎత్తుకు సమ్మతించాలని మహారాష్ట్రను కోరనున్నారు. ఇక తెలంగాణకు 2.43 టీఎంసీల నీటితో 22 వేల ఎకరాలకు నీటిని అందించే లెండి ప్రాజెక్టు కాలువల నిర్మాణం, 5.12 టీఎం సీల నీటిని వినియోగించుకునే అవకాశమున్న దిగువ పెన్‌గంగ కింది కాలువల నిర్మాణం, భూసేకరణకు మహారాష్ట్ర ముందుకు రావాలని కోరనున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర సహకారం కోరతాం: హరీశ్ అంతర్రాష్ట్ర ప్రాజెక్టులైన ప్రాణహిత-చేవెళ్ల, ఇచ్చంపల్లి, లెండి, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టులపై మహారాష్ట్రతో కీలక చర్చలు జరుపుతామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముంబై బయలుదేరే ముం దు ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అడ్డంకులను తొలగించే దిశగా భేటీ ఉంటుందని హరీశ్ స్పష్టం చేశారు. లెండి, పెన్‌గంగ పూర్తయితే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో లక్ష ఎకరాల ఆయకట్టు వృద్ధిలోకి వస్తుందన్నారు. -
యువత చేతిలోనే భవిత
వారు దేశం కోసం పాటుపడాలి స్వర్ణ భారత్ ట్రస్టు సంక్రాంతి వేడుకల్లో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నెల్లూరు: ‘‘దేశం మొత్తం జనాభాలో 25 ఏళ్లలోపు యువకులు 50 శాతం మంది ఉన్నారు. వీరిలో నైపుణ్యం పెంచి, సద్వినియోగం చేసుకుంటే 2020 నాటికి భారత్ అగ్రదేశం అవుతుంది’’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు ప్రాంగణంలో స్వర్ణభారత్, స్వచ్ఛభారత్ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫడ్నవీస్ ‘నమస్కారం, మీ అందరికీ శుభ మధ్యాహ్నం, సంక్రాంతి శుభాకాంక్షలు’ అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రతి యువకుడూ నైపుణ్యాన్ని సంపాదించుకుని దేశ భవిష్యత్ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, మన పండుగల విశిష్టతను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 26 ఏళ్లకే మేయర్‌గా ఎన్నికైన ఫడ్నవీస్ అవినీతి పరుల పాలిట సింహస్వప్నమని, అభివృద్ధికి మారుపేరని కొనియాడారు. ఆయన దేశ భవిష్యత్ రాజకీయాల్లో ధృవతారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలందరూ ఒకరికొకరు బంధువులేనన్నారు. చిరంజీవి మూడో కన్ను: వెంకయ్య తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లు అయితే చిరంజీవిని మూడో కన్నుగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు. పవన్ కల్యాణ్ స్వార్థం కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లో వచ్చారన్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చేందుకు కారణమైన వారిలో పవన్ కల్యాణ్ ఒకరని చెప్పారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్టుకు ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ఇతర రంగాల ప్రముఖుల్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు. వెంకయ్యనాయుడు ఆదర్శనీయుడని, ఫడ్నవీస్ స్ఫూర్తినిచ్చే వ్యక్తి అని పవ న్ కళ్యాణ్ కొనియాడారు. స్వచ్ఛ భారత్ అంటే ఫొటోలకు ఫోజు లివ్వడం కాదన్నారు. శుభ్రత మన నుంచే ప్రారంభం కావాలని సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అభిమానులందరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఫడ్నవీస్, వెంకయ్యనాయుడు ప్రసంగించే సమయంలో మైక్ కొద్దిసేపు పని చేయలేదు. దీంతో వెంకయ్య కొంత అసహనానికి గురయ్యారు. శ్రీవారిని దర్శించుకున్న ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం రాత్రి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకున్న ఆయన మహాలఘులో స్వామి దర్శనానికి వెళ్లారు. -
యువతలో నైపుణ్యం పెంచేందుకు మోదీ కృషి
నెల్లూరు: దేశానికి యువతే ప్రధాన శక్తి అని, వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి.. ఆర్థికంగా ఎదిగేలా చేయడానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఆయన నెల్లూరులో జరిగిన స్వర్ణభారతి సంక్రాంతి సంబరాల్లో పాల్గొని వ్యాఖ్యానించారు. బీజేపీ బలపడేందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడ్పడ్డారన్నారు. -
ఇంట్లోనే సంజయ్‌దత్
ముంబై: రెండు వారాల ఫర్లాగ్(తాత్కాలిక సెలవులాంటిది) బుధవారంతో ముగిసినప్పటికీ, సెలవు పొడిగింపుపై పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఇంట్లోనే ఉండిపోయాడు. 14రోజుల ఫర్లాగ్ తీసుకున్న వ్యక్తి పై 29వ రోజు వరకూ ఎలాంటి చర్యా తీసుకోలేమని జైళ్లశాఖ విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ఆయనకు మరో 14 రోజుల సెలవు అదనంగా వచ్చినట్లయింది. ఈ కారణంగానే సం జయ్‌పై ఎలాంటి చర్యా తీసుకోవడానికి వీలులేదని, సెలవు అభ్యర్థన తిరస్కరిస్తే 24గంటల్లోపు సంజయ్ లొంగిపోతారని ఆయన న్యాయవాది తెలిపారు. సంజయ్ సెలవు పొడగిం పు అభ్యర్థనను పరిష్కరించడం లో జరుగుతున్న జాప్యంపై విమర్శలు రావడంతో ఈ విషయంలో చట్టప్రకారం వెళ్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శుక్రవారం గాంధీనగర్‌లో వ్యాఖ్యానించారు. -
‘జావ్‌ఖేడా’ బాధితులకు సత్వర న్యాయం
ముంబై: అహ్మద్‌నగర్ జిల్లా జావ్‌ఖేడా గ్రామంలో ఇటీవల జరిగిన ముగ్గురు దళిత కుటుంబ సభ్యుల హత్య కేసును సత్వరమే పరిష్కరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయం చేయాలని ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయని, దీన్ని అవకాశంగా తీసుకుని స్వార్థ రాజకీయ నాయకులు, నక్సల్స్ హింసను ప్రేరేపించే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఆ పార్టీ సోమవారం స్పందించింది. ఈ అమానుష ఘటన వెనుక శక్తులను వెంటనే అరెస్టు చేసేందుకు నూతన ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. కాగా, మృతుల కుటుంబాలను ఇప్పటికే మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెన్నెస్ నేత రాజ్‌ఠాక్రే తదితరులు పరామర్శించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. అలాగే ఈ హత్యలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని డీజీపీ సంజీవ్ దయాళ్ను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.