‘జావ్‌ఖేడా’ బాధితులకు సత్వర న్యాయం
ముంబై: అహ్మద్‌నగర్ జిల్లా జావ్‌ఖేడా గ్రామంలో ఇటీవల జరిగిన ముగ్గురు దళిత కుటుంబ సభ్యుల హత్య కేసును సత్వరమే పరిష్కరించాలని బీజేపీ ప్రభుత్వాన్ని శివసేన డిమాండ్ చేసింది. బాధితులకు న్యాయం చేయాలని ఇప్పటికే పలు సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయని, దీన్ని అవకాశంగా తీసుకుని స్వార్థ రాజకీయ నాయకులు, నక్సల్స్ హింసను ప్రేరేపించే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఆ పార్టీ సోమవారం స్పందించింది. ఈ అమానుష ఘటన వెనుక శక్తులను వెంటనే అరెస్టు చేసేందుకు నూతన ముఖ్యమంత్రి కఠినంగా వ్యవహరించాలని హితవు పలికింది. కాగా, మృతుల కుటుంబాలను ఇప్పటికే మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎమ్మెన్నెస్ నేత రాజ్‌ఠాక్రే తదితరులు పరామర్శించారు.
ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని కోరారు. అలాగే ఈ హత్యలపై సమగ్ర విచారణ జరిపించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని డీజీపీ సంజీవ్ దయాళ్‌ను గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే.