న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు ప్రయాణ సమయంలో, స్టేషన్‌లలో నాణ్యమైన భోజనం, తాగునీరు అందజేస్తున్నారా? లేదా? వివరణ ఇవ్వాలని రైల్వే శాఖను ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ప్రభుత్వ వాదనలను తెలియజేయాలని కోరింది.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరి శంకర్‌ల హైకోర్టు ధర్మాసనం రైల్వే శాఖ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ)కి నోటీసులు జారీ చేసింది. రైళ్లలో, స్టేషన్‌లలో నాణ్యతలేని భోజనం, గుర్తింపులేని బ్రాండ్ల నీళ్ల బాటిళ్లను అందజేస్తున్నట్లు కాగ్ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో వివరించింది. దీని ఆధారంగా నరేంద్ర ఖన్నా ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.