స్మృతి సీరియస్గా తీసుకున్నారా..!
పనాజీ: మెల్లమెల్లగా సర్దుమణిగి పోతుందనుకున్న ఫ్యాబిండియా సీసీటీవీ కెమెరా కేసు వివాదం తాజాగా వేగం పుంజుకొంది. గురువారం తమ ముందుకు వచ్చి వివరణలు ఇవ్వాల్సిందిగా సంస్థ ఎండీ, సీఈవోకు తాజాగా గోవా పోలీసులు సమన్లు అందజేశారు. మరో పదకొండుమంది ఉద్యోగులకు కూడా ప్రశ్నించేందుకు పిలిచారు. కాండోలిమ్లోని ఫ్యాబిండియాలో షాపింగ్కు వెళ్లిన స్మృతి ఇరానీ.. ట్రయల్ రూమ్ వద్ద సీసీటీవీ కెమెరాను గుర్తించిన విషయం తెలిసిందే.
దీంతో గోవా బీజేపీ నేత మైఖెల్ లోబో ఫిర్యాదు మేరకు ఫ్యాబిండియాపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నలుగురుని పోలీసులు అరెస్టు చేసినా తిరిగి వారు బెయిల్పై బయటకు వచ్చారు. అనంతరం, బీజేపీ నేతలు స్వయంగా ఈ ఘటనను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ కేసులో పెద్దగా అభివృద్ధేమి లేదని, ఫ్యాబిండియా స్మృతి ఇరానీకి క్షమాపణలు చెప్పడంతో వివాదం సర్దుమణిగినట్లేనని అందరూ భావించారు. కానీ, తాజాగా ఆ సంస్థ ఎండీ, సీఈవోకు సమన్లు పంపించడం చూస్తుంటే పైకి కనిపించకపోయినా కేంద్రమంత్రి ఈ విషయాన్ని కాస్త తీవ్రంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది.