ఇద్దరు మంత్రులపై వేటు వేసిన సీఎం
ఇద్దరు మంత్రులపై వేటు వేసిన సీఎం
Published Tue, Dec 13 2016 8:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ తన మంత్రివర్గంలోని ఇద్దరు మంత్రులపై వేటు వేశారు. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)కి చెందిన ఇద్దరినీ తన ప్రభుత్వం నుంచి పీకేశారు. గోవాలో బీజేపీ-ఎంజీపీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే, రెండు పార్టీల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో బాగా చెడిపోవడంతో.. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే విషయం అనుమానంగానే ఉంది. మంత్రులను తొలగిస్తున్న విషయాన్ని గోవా గవర్నర్ మృదులా సిన్హాకు సోమవారం అర్ధరాత్రి సమయంలో పర్సేకర్ తెలిపారు. సుదిన్ ధావలికర్ దీపక్ ధావలికర్ అనే ఇద్దరినీ పదవుల నుంచి ఆయన తీసేశారు. దాంతో గోవా మంత్రివర్గంలో మొత్తం మంత్రుల సంఖ్య పదికి తగ్గింది.
రాజ్యాంగంలోని 164 (1) అధికరణం కింద వాళ్లిద్దరినీ తొలగించాలని సూచించినట్లు పర్సేకర్ చెప్పారు. వాళ్లిద్దరి వద్ద ఉన్న అన్ని శాఖలను వేరే మంత్రులకు కేటాయించేవరకు ప్రస్తుతానికి తనవద్దే ఉంటాయని తెలిపారు. ఎంజీపీ తరఫున కేబినెట్‌లో ఇద్దరు మంత్రులే ఉండేవారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో 21 స్థానాలు బీజేపీకి రాగా, ఎంజీపీ మూడుచోట్ల గెలిచింది. ఎన్నికలకు ముందే రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇద్దరు మంత్రులను తొలగించినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదు. సుదిన్ ధావలికర్ వద్ద రవాణా, ప్రజాపనుల శాఖ ఉండగా, డీపక్ వద్ద గ్రామీణాభివృద్ధి శాఖ ఉండేది.
మంత్రులను తొలగించే అధికారం తనకు రాజ్యాంగబద్ధంగా ఉందని, వాళ్లు తనమీద విమర్శలు చేస్తున్నందువల్లే తప్పించానని సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ స్పష్టం చేశారు. ఈ ఖాళీల్లోకి ఎవరిని తీసుకోవాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. అయితే, తమను తప్పించిన విషయం ఇంకా తమవరకు రాలేదని ఎంజీపీ మంత్రులు ఇద్దరూ చెప్పారు.
Advertisement
Advertisement