పణజి: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సీటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ పర్సేకర్ కూడా రాజీనామా అస్త్రాన్ని సంధించారు. బీజేపీకీ రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇక బీజేపీలో కొనసాగాలని కోరుకోవడం లేదని, రాజీనామా చేయాలనుకుంటున్నట్టు పీటీఐతో చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తానని తెలిపారు.
పర్సేకర్ ప్రస్తుతం గోవా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యుడి కూడా ఆయన కొనసాగుతున్నారు. 2002 నుంచి 2017 వరకు మాండ్రేమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి పర్సేకర్ ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ సోప్టేకు కట్టబెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పర్సేకర్.. కాంగ్రెస్ అభ్యర్థి దయానంద్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే 2019లో మరో 9 మంది నాయకులతో కలిసి దయానంద్ అధికార బీజేపీలో చేరారు. (చదవండి: బీజేపీ గెలవాలని కోరుకుంటున్న ములాయం!)
పర్సేకర్.. 2014 నంచి 2017 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను రక్షణ మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పర్సేకర్‌ను సీఎంగా నియమించారు. కాగా, ఫిబ్రవరి 14న జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలకు 34 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. (చదవండి: ఇక బీజేపీకి గుడ్ బై: మాజీ సీఎం తనయుడు)
Comments
Please login to add a commentAdd a comment