
పణజి: గోవా శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన ఐదు జంటలకు మిశ్ర ఫలితాలు వచ్చాయి. మూడు జంటలు విజయాన్ని అందుకోగా, రెండు జంటలు ఓటమిపాలయ్యాయి. బీజేపీ తరపున పోటీ చేసిన రెండు జంటలు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక జంట విజయాన్ని సాధించాయి.
ప్రతిష్టాత్మక పణజి నియోజకవర్గం నుంచి 716 ఓట్ల స్వల్ప మెజారిటీతో అటానాసియో మోన్‌సెరెట్టే గెలిచారు. ఆయన భార్య జెన్నీఫర్.. తలైగావ్ స్థానం నుంచి విజయాన్ని నమోదు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి టోనీ ఆల్ఫ్రెడో రోడ్రిగ్స్ పై 2041 ఓట్ల ఆధిక్యంతో జెన్నీఫర్ విజయం సాధించారు.
రాణే జంట విన్
బీజేపీ నేత, వైద్యశాఖ మంత్రి విశ్వజిత్ ప్రతాప్‌సింగ్ రాణే.. వాల్పోయి నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన సతీమణి దేవీయ విశ్వజిత్ రాణే.. పోరియం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దేవీయ 13 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం విశేషం. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దేవీయ మామగారు రంజిత్ జయసింగ్‌రావు రాణే కూడా కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేశారు. అయితే ఆయన ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసిన విశ్వజిత్ రాణే రెండో స్థానంలో నిలిచారు.
లోబో కపుల్స్ విక్టరీ
కాంగ్రెస్ అభ్యర్థి మైఖేల్ విన్సెంట్ లోబో.. కలన్‌గుట్ స్థానం నుంచి గెలుపొందగా, ఆయన భార్య డెలిలా మైఖేల్ లోబో.. సియోలిమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1727 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి దయానంద్ రాయు మాంద్రేకర్‌ను డెలిలా ఓడించారు. మైఖేల్.. 4979 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి జోసెఫ్ రాబర్ట్ సెక్వేరాపై గెలిచారు.
కవ్లేకర్ దంపతుల పరాజయం
ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ కవ్లేకర్, ఆయన సతీమణి సావిత్రి కవ్లేకర్ కూడా పోటీలో ఉన్నారు. క్యూపెమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చంద్రకాంత్ 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్టన్ డికోస్టా చేతిలో ఓడిపోయారు. సంగెం అసెంబ్లీ సీటు భంగపడిన సావిత్రి.. ఇండింపెండెంట్‌గా పోటీ స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. (క్లిక్: గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే?)
తృణమూల్ జంట ఓటమి
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అల్డోనా నియోజకవర్గం నుండి కిరణ్ కండోల్కర్‌కు టికెట్ ఇవ్వగా, అతని భార్య కవిత.. థివిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ ఓటమిపాలయ్యారు. (క్లిక్: గెలిచినా సంతోషం లేదంటున్న బీజేపీ అభ్యర్థి)
Comments
Please login to add a commentAdd a comment