ప్రతీకాత్మక చిత్రం
ఇవేవో కొత్త తరహా బీచులు అనుకుని వెంటనే వెళ్లి చూసొద్దామని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే..! గోవా బీచులు మొత్తం దేశంలోనే అధిక మోతాదులో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉన్నాయి. ఈ బీచుల్లో అత్యధిక స్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలు, చెత్త కేంద్రీకృతమైనట్లు కొచ్చిలోని సెంట్రల్ మెరైన్ ఫిషరీష్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(సీఎంఎఫఆర్ఐ) తాజా అధ్యయనం తేల్చింది. గోవా బీచుల్లోని ప్రతీ మీటరు ఇసుకలో 25.47 గ్రాముల ప్లాస్టిక్ అవశేషాలున్నట్లు కనుగొన్నారు. దీనితో పాటు భారత్‌లోనే అత్యధికంగా ఇక్కడి బీచుల్లోనే ప్రతీ మీటరుకు 205.75 గ్రాములు/ఎం2- చొప్పున నైలాన్ చేపల వలలు, గాజు, ఈ-వ్యర్థాలు, స్టయిరోఫోమ్, థర్మోకోల్‌లతో కూడిన చెత్తా, చెదారం ఉన్నట్లు వెల్లడించింది.
గోవా ఆ తర్వాతి స్థానాల్లో కర్నాటక, గుజరాత్....
దేశవ్యాప్తంగా 7,516 కి.మీ మేర ఉన్న తీరప్రాంతంలోని బీచుల్లో 12 మంది సభ్యుల బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. గోవాలోని 12 బీచులతో సహా, 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 254 బీచుల్లో పరిశీలన జరిపారు. ఇందులోని చెత్తా, చెదారాన్ని ఆరు కేటగిరీ కింద వర్గీకరించారు. గోవా తర్వాత కర్ణాటకలోని 33 బీచుల్లో ప్లాస్టిక్, నైలాన్ వలలు, ఇతర వ్యర్థాలు ఎక్కువ మోతాదులో ఉన్నట్లు వెల్లడైంది. అక్కడి బీచుల్లో ప్రతీ మీటర్‌కు 21.91 గ్రాములు/ఎం2 చొప్పున చెత్త, ప్లాస్టిక్ అవశేషాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ జాబితాలో తరవాతి స్థానంలో గుజరాత్‌లోని 12 బీచులు ఉన్నాయి. ఇక్కడ సగటున 12.62 గ్రాములు/ఎం2 వ్యర్థాలు ఉన్నట్లు స్పష్టమైంది. మొత్తంగా కర్నాటక బీచుల్లో 178.44 గ్రాములు/ఎం2, గుజరాత్ బీచుల్లో 90.56 గ్రాములు/ఎం2 పరిమాణంలో వ్యర్థాలున్నాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలోని బీచుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఒడిశాలోని బీచుల్లోనే తక్కువ స్థాయిలో ప్లాస్టిక్ అవశేషాలున్నట్లు బయటపడింది.
ఏయే రూపాల్లో....
ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రధానంగా ప్లాస్టిక్ కవర్లు, క్యారీబ్యాగులు, డిటర్జెంట్ సబ్బులు సాచెట్లు, పాల ప్యాకెట్లు, టూత్‌పేస్ట్, నూనె, ఇతర సౌందర్య సాధనాలు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల రూపంలో ఉంటున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, అవశేషాలతో బీచులకే కాకుండా సముద్ర జీవజాతులకు కూడా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్ర పక్షులు, తాబేళ్లు, వేల్ చేపలు, పగడపు దిబ్బలపై ప్రభావం చూపుతున్నాయి. ‘నిత్యావసర సరుకులు మొదలుకుని మిగతా వస్తువుల వరకు అన్నింటికీ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారు. వాడేసిన తర్వాత బయట పడేసిన ఈ ప్లాస్టిక్ అంతా నదుల మీదుగా సముద్రాలను చేరుతోంది. వేడితో పాటు తేమ వాతావరణం కారణంగా బీచుల్లో విసిరేసిన ప్లాస్టిక్ చెత్త కాస్తా మైక్రో ప్లాస్టిక్‌ల కింద మారి సముద్రంలోకి చేరుతోంది’ అని సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రధాన పరిశోధకుడు పి.కళాధరన్ తెలిపారు. సముద్రంలోని ప్లాస్టిక్ అవశేషాల ప్రభావం మొత్తం ఏడు రకాల తాబేళ్లపై పడుతున్నట్లు, ఏడువందలకు పైగా సముద్రం జీవజాతులు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు మరో పరిశీలనలో వెల్లడైంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment