కటక్: మరో ఆధ్యాత్మిక గురువు వివాదంలో చిక్కుకున్నాడు. జైపూర్ జిల్లాలోని ఛండీఖోల్ లో కైబాల్యా ఆశ్రమం నిర్వహిస్తున్న సచిత్రా పరిదా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూజ చేయాలని ఆ మహిళకు మాయమాటలు చెప్పి లైంగిక చర్యలకు తెరలేపాడు. దీంతో ఆ మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ మహిళ తన భర్తతో కలిసి పరిదాను కలుస్తుండేది. ఈ క్రమంలోనే అతని ప్రవర్తనపై అనుమానం కల్గిన ఆ మహిళ ఆశ్రమానికి వెళ్లడం మానేసింది. అయితే తాజాగా శనివారం పరిదా నుంచి ఆ మహిళకు పిలుపువచ్చింది. తన ఇంటిదగ్గర పూజ చేయాలని ఆ పిలుపులో సారాంశం. ఒకవేళ ఆ పూజ చేయించుకోకపోతే త్వరలోనే నీ భర్త చనిపోతాడంటూ దొంగ స్వామిజీ హెచ్చరించాడు. ఆ స్వామిజీ మాటలతో భయపడిన మహిళ అతని ఇంటికి వెళ్లింది.
ఆ సమయంలో తన భర్తకూడా ఇంటిలో లేకపోవడంతో ఒంటరిగానే అతని వద్దకు వెళ్ళింది. దీన్ని అదునుగా తీసుకున్న స్వామిజీ ఆ మహిళను లైంగికంగా లొంగదీసుకోవాలని యత్నించాడు. దీంతో అసలు విషయాన్నిగ్రహించిన మహిళ అక్కడ ఉన్న అలారాన్ని మోగించడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు చేరుకుని పరిదాను చితకబాదారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ ఐ సుజాతా జెనా స్పష్టం చేశారు.