గూగుల్ మ్యాప్స్ ప్రామాణికం కావు
- భారత సర్వేయర్ అడిషనల్ జనరల్ వీపీ శ్రీవాస్తవ
సాక్షి, న్యూఢిల్లీ : గూగుల్ మ్యాప్‌లు ప్రామాణికం కాదని, వాటిని ప్రభుత్వం తయారు చేయలేదని భారత సర్వేయర్ అడిషనల్ జనరల్ వీపీ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత సర్వేవిభాగం తయారుచేసిన మ్యాప్‌లనే నేటికీ సదుపాయాల కల్పన కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చాలామంది చిన్న చిన్న వాటికోసమే గూగుల్ మ్యాప్‌లను చూస్తున్నారని, భారత సర్వేవిభాగం తయారుచేసే మ్యాప్‌లు అన్నింటికీ ఉపయోగపడుతాయని చెప్పారు.
సర్వే విభాగానికి చెందిన నైసర్గిక స్వరూపాలను తెలిపే మ్యాప్‌లు కచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని, కొత్త రైలు మార్గాలు, కాల్వల పనులు చేపట్టేందుకు ఇవి ఉపయోగపడుతాయన్నారు. భారత రాజ్యాంగం మొదటి కాపీని, మొదటి తపాలా స్టాంపునకు సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక గౌరవం కల్పించిందని కేంద్రమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. సరైనవిధంగా సర్వే, మ్యాప్‌లను చేపట్టాకే ఏ అభివృద్ధి పనులైనా చేపట్టాలని పేర్కొన్నారు.