లక్నో: కరోనా కట్టడికి మరో విడత లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధనను అమలు చేసేందుకు శాశ్వత ప్రాదిపదికన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ విద్యావిధానంలో అవసరమై ఈ-కంటెంట్ రూపకల్పనకు కృషి చేయాలని చెప్పారు. విద్యాశాఖపై బుధవారం జరిగిన సమీక్షలో సీఎం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు.
(చదవండి: లాక్‌డౌన్: ఆన్‌లైన్‌లో ఎన్ని పాఠ్యాంశాలో..!!)
ప్రైమరీ, సెకండరీ, హయ్యర్, టెక్నికల్, వృత్తివిద్యా, మెడికల్, నర్సింగ్, ఇతర విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులపై మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం చెప్పారని సమాచార శాఖ ముఖ్యకార్యదర్శి అవనీష్ అవస్థీ తెలిపారు. కాగా, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యకు సంబంధించి మంగళవారం జరిగిన ఆన్‌లైన్ బోధనలో 80 వేల మంది పాలుపంచుకున్నారని అవస్థీ తెలిపారు. దీనికి సంబంధించి 2,736 గంటల కంటెంట్‌ను అప్‌లోడ్ చేశామని తెలిపారు.
(చదవండి: కరోనా అలర్ట్ : హాట్‌స్పాట్స్‌గా 170 జిల్లాలు..)
ఇదిలాఉండగా.. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన సంరక్షణా చర్యలు చేపట్టి ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు త్వరలో తిరిగి ప్రారంభిస్తామని సమాచార ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. కోవిడ్‌పై పోరులో మానవ వనరుల కొరత ఉన్నందున ఫైనలియర్ చదువుతున్న ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. అందుకు అవసరమైన శిక్షణను వారికి ఇప్పిస్తామని చెప్పారు. ఇక కోవిడ్ కేసులు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కేంద్రం సండలింపులు ఇవ్వనున్న నేపథ్యంలో భవన, రోడ్డు నిర్మాణ కార్మికులను పనులకు అనుమతిస్తామని తెలిపారు. రైతుల నుంచి గోధుమల కొనుగోలుకు మార్గదర్శకాలు జారీ చేశామని అవస్థీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment