ఢిల్లీ: అధికార పక్షానికి ఒక పద్ధతిలో, ప్రతిపక్షాలకు మరో రకంగా విధానాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం డర్టీ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. బుధవారం రాజ్యసభ సమావేశం వాయిదా పడిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు.
ప్రతిపక్ష నాయకులను కేసుల్లో ఇరికించేందుకే అవినీతి నిరోధక శాఖ అధికారిని ఇటీవల ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిందని గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. అలాగే అధికార పార్టీ నేతలపై ఉన్న కేసులను సమాధి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో డైరెక్టర్లు, షేర్ హోల్డర్లు ఎవ్వరూ అవినీతికి పాల్పడలేదని ఆజాద్ స్పష్టం చేశారు.
గతంలో ఉన్న అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ నేషనల్ హెరాల్డ్ కేసును మూసివేయాలని భావించినట్లు తెలిపారు. అయితే ఆయన స్థానంలో మరొకరిని తీసుకురావడం.. ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడానికి చేసిన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ నిర్థోషిగా బయటపడుతుందని గులాం నబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు.
'ప్రభుత్వం డర్టీ గేమ్ ఆడుతోంది'
Published Wed, Dec 9 2015 8:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement
Advertisement