
కోవిడ్-19 మరణాలను తక్కువగా చూపుతున్నారన్న ప్రచారం అవాస్తమని ప్రభుత్వం పేర్కొంది
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్-19 మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. కోవిడ్-19తో పాటు ఇతర వ్యాధులతో మరణించిన వారి గణాంకాలను విశ్లేషించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదని, మృతుల సంఖ్యను తక్కువ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. మరోవైపు భారత్‌లో కరోనా మరణాలను తక్కువగా చూపడం లేదని ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త నివేదియా గుప్తా చెప్పారు. కోవిడ్-19 మరణాలను కొద్దిసంఖ్యలో చూపుతున్నారని తామెవరూ భావించడం లేదని, ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటులో భారత్ చాలా మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు.
కాగా భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు 1,98,706కు చేరాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించగా, ఇప్పటికే మొత్తం పాజిటివ్ కేసులు రెండు లక్షలు దాటాయని అనధికార అంచనా. గత వారం రోజులగా రోజుకు సగటున 6300 కేసులు వెలుగు చూస్తుండగా గత మూడు రోజులుగా సగటున రోజుకు 8000 కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో అత్యధికంగా మంగళవారం ఒక్కరోజే 8392 కేసులు బయటకువచ్చాయి.