
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో జాతీయ స్ధాయిలో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి జరగలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. వైరస్‌ను దీటుగా నియంత్రించగలిగామని వెల్లడించింది. ప్రపంచంలోనే ప్రతి లక్ష మంది జనాభాలో వైరస్ కేసుల సంఖ్య, మరణాల రేటు భారత్‌లో అతితక్కువగా ఉందని తెలిపింది. మరణాల రేటు మనవద్ద కేవలం 2.8 శాతమే ఉందని, ఇది ప్రపంచంలో అత్యల్పమని పేర్కొంది. అయితే వైరస్ అనుమానితులు పెద్దసంఖ్యలో ఉండవచ్చని, వారిని గుర్తించేందుకు టెస్టింగ్ సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచగలిగామని తెలిపింది.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పటివరకూ 1,41,000 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 49.01 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9996 తాజా కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,86,000కు పెరిగిందని వెల్లడించారు. ఇక గురువారం ఒక్కరోజే 357 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 8000 దాటగా, 1,37,000 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా రోగుల కోసం ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. ఆస్పత్రులు బెడ్‌ల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment